మయన్మార్‌కు చెందిన ముగ్గురు రోహింగ్యాలను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాపూర్ మండలం నర్గింగ్ తండాలోని ఓ ఫామ్ హౌస్‌లో పోలీసులు వీరిని గుర్తించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కి తరలించారు.
మయన్మార్‌కు చెందిన నూర్ మహమ్మద్ హైదరాబాద్ బాలాపూర్‌కి అక్రమంగా వచ్చాడు. భారత పౌరునిగా నకిలీ పాస్‌పోర్టు చేయించుకుని సౌదీ అరేబియాకు వెళ్లాడు. అనంతరం 2022లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. 2022 అక్టోబర్‌లో మళ్లీ వీసా తీసుకుని దుబాయ్‌కి వెళ్లి నెలలోనే తిరిగి వచ్చాడు. బాలాపూర్‌లో రోహింగ్యా మహిళ రిజ్వానాను పెళ్లి చేసుకున్నాడు. ఏజెంట్ సాయంతో త్రిపుర రాష్ట్రంలోని సరిహద్దు గుండా ఇద్దరు బంగ్లాదేశ్‌కు వెళ్లారు. బంగ్లాదేశ్‌లో ఏడాది పాటు ఉన్న ఈ జంట.. వారుండే ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మహమ్మద్ ఆరోబ్ అహ్మద్ దంపతులకు భారత్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చెప్పారు. భారత్‌కి వెళ్లేందుకు సహాయం చేస్తామని చెప్పి… వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు.
2024 మార్చిలో త్రిపుర రాష్ట్రంలోని చర్మానగర్ వద్ద సరిహద్దు భారత్‌లోకి రెండు జంటలు ప్రవేశించాయి. త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకుని అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్‌కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన అయోగ్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌజ్‌లో పనిలో చేరారు. 8 నెలల నుంచి నలుగురు ఫామ్ హౌజ్‌లోనే ఉన్నారు. పది రోజుల క్రితం ప్రధాన నిందితుడు నూర్ అహ్మద్ ఏజెంట్ సాయంతో అతని భార్యను బంగ్లాదేశ్‌కు పంపించాడు. పక్కా సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న ముగ్గురు అక్రమ చొరబాటుదారులను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. వారి నుంచి నకిలీ ధృవపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.