బుధవారం గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న మిర్చి రైతులను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలకు, ప్రచారాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. జగన్ సభ, ర్యాలీ చేపట్టరని… కేవలం మిర్చి రైతులతో మాట్లాడతారని వైసీపీ నేతలు చెప్పారు. అందుకు అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే పోలీసుల మాటలను బేఖాతరు చేసిన జగన్.. గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు. మిర్చి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని తాను ప్రతిపక్ష నాయకుడిగా చెప్పుకున్నారు. తనకు పోలీసుల భద్రత ఎందుకు కల్పించలేదని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్.. తాము అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలకు కూడా ఇలాగే పోలీసు భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. మిర్చి రైతుల ఇబ్బందులను అధికార కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏ పంటకూ కూడా గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో క్వింటాకు రూ. 10 -12 కూడా ధర పలకడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో మిర్చి క్వింటాకు రూ. 21 నుంచి రూ.27వేల వరకు ధర పలికేదని అన్నారు. రైతులు తమ పంటను అమ్ముకోలేని దీన స్థితిలో ఉన్నారని జగన్ విమర్శించారు.
రాష్ట్రంలో రైతుల దీనస్థితికి ప్రభుత్వమే కారణమని జగన్ ఆరోపించారు. అన్నదాతలను దళారులకు చంద్రబాబు ప్రభుత్వం అమ్మేసిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించి వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతులను దళారులకు చంద్రబాబు ప్రభుత్వం అమ్మేసిందని ఆరోపించారు. ఇకనైనా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని.. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని రైతుల తరపున హెచ్చరిస్తున్నామని జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.