నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం.. మూడు జనరేషన్లుగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు నాలుగో జనరేషన్ హీరో ఎంట్రీకి రంగం సిద్దమౌతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. ఓ వీడియో వలన సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతుంది. అయితే.. ఒకేసారి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు తమ వీడియోలతో వార్తల్లో నిలిచారు. ఇంతకీ.. ఆ రెండు వీడియోల్లో ఏముంది..? నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చే ఫోర్త్ జనరేషన్ హీరో ఎవరు..?
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన కొడుకులు బాలకృష్ణ, హరికృష్ణ సినిమాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించగా.. కళ్యాణ్ రామ్ విభిన్న కథా చిత్రాలు చేసి ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరో వైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి ఫోర్త్ జనరేషన్ హీరోగా జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆతర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ పేరు నెట్టింట ట్రెండిగ్ మారింది. దీంతో కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ ఎంట్రీకి రెడీ అంటూ ప్రచారం ఊపందుకుంది. అసలు ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఏంటంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో. అందులో శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతడి ఫిట్ నెస్, పవర్ ఫుల్ పంచ్ లు, యాక్షన్ మూవ్స్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరో నందమూరి హీరో రెడీ అవుతున్నారని, మరో మాస్ హీరో వస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే.. శౌర్య రామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా టైమ్ ఉందని కూడా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వైరలైన మరో వీడియో ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన ఎనర్జీటిక్ డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఆమె వేసిన స్టెప్పులు గ్రేస్‌ఫుల్‌గా, ఎనర్జీతో ఉండటంతో ఫ్యాన్స్ అదిరిపోయారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ప్రచారాలకు దూరంగా ఉండే తేజస్విని ఇలా డ్యాన్స్ అదరగొట్టింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఈవిధంగా తేజస్విని సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ఇలా నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్, బాలయ్య కుమార్తె తేజస్వి వీడియోలతో వైరలై వార్తల్లో నిలవడం విశేషం.


