హైదరాబాద్: ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సముదాయాలు తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి వనరుల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు — జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గత 37 ఏళ్లుగా నగర ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తూ, మురుగునీటి నిర్వహణ సేవలు కొనసాగిస్తున్న జలమండలిని అభినందించారు. నగరాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణలో సంస్థ సేవలను ప్రశంసించారు.
హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నీటి భద్రతకు, జలవనరుల సుస్థిర నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. గృహేతర అవసరాలకు తాగునీటి వినియోగాన్ని తగ్గించి, ప్రజల అత్యవసర గృహ అవసరాలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
జలమండలి ప్రారంభించిన ‘డయల్ గ్రీన్ ట్యాంకర్–గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’ కార్యక్రమాన్ని సకాలంలో చేపట్టిన కీలక చర్యగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. పచ్చదనం నిర్వహణ, నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని విస్తృతంగా వినియోగించాలని కోరారు. తద్వారా విలువైన తాగునీటిని ఆదా చేయవచ్చని తెలిపారు.
నీటి పొదుపును ప్రతి ఒక్కరూ సమష్టి బాధ్యతగా స్వీకరించాలని సీఎం పిలుపునిచ్చారు. నీటి భద్రత కలిగిన సుస్థిర హైదరాబాద్ నిర్మాణంలో ప్రజలు, సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. కోర్ అర్బన్ రీజియన్ — క్యూర్ పరిధిలో ప్రజలకు సేవలందించడంలో జలమండలి మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.


