వివాహేతర సంబంధం.. చివరకు హత్యకు దారితీసింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసి, అడవిలో పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో వెలుగుచూసింది.
తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లాకు చెందిన శశికుమార్‌ను డబ్బులు ఇస్తామని నమ్మించి తిరుపత్తూరుకు రప్పించిన నిందితులు.. పెద్దవంక అడవి ప్రాంతంలోని గుండాలమడుగు వంక వద్ద బీర్ బాటిల్ ముక్కతో దాడి చేసి, రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వ్యవసాయ పనిముట్లతో గుంత తవ్వి, పెద్దవంక అడవిలోని కొత్తకుంట కట్ట వద్ద మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తెలిపారు. సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు కూడా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కుప్పం మండలం కంగుంది గ్రామానికి చెందిన ప్రభుదేవ అలియాస్ ప్రభుతో పాటు మృతుడి భార్యను కుప్పం–కంగుంది రోడ్డులోని నాయనూరు చెక్‌పోస్ట్ వద్ద అరెస్ట్ చేసినట్లు కుప్పం అర్బన్ సీఐ జీటీ నాయుడు వెల్లడించారు. ఘటనపై క్రైమ్ నంబర్ 220/2026 కింద బీఎన్ఎస్ 103(1), 238 సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


