సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కి టైమింగ్ ఎంత కీలకమో.. కయాదు లోహర్ కెరీర్ను చూస్తే అర్థమవుతుంది. నార్త్ ఇండియాకు చెందిన ఈ బ్యూటీ 2021లో కన్నడ మూవీ ‘ముగిల్పేట్’తో సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే తొలి సినిమా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాలేకపోయింది.అయినా అవకాశాలు మాత్రం ఆగలేదు.
కెరీర్ మొదలైన రెండో ఏడాదిలోనే మలయాళం, తెలుగు సినిమాల్లో నటించే అవకాశం కయాదుకు దక్కింది. 2022లో ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో టాలీవుడ్లో కయాదుకు వెంటనే వరుస అవకాశాలు రాలేదు.ఆ తర్వాత సౌత్లో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో మరాఠీ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కయాదు కెరీర్లో కొంత గ్యాప్ వచ్చింది.
2024లో ఆమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు.కానీ 2025లో వచ్చిన ‘డ్రాగన్’ మాత్రం కయాదు కెరీర్ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమా విజయంతో ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. 2021 నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ రాని క్రేజ్.. ఒక్క ‘డ్రాగన్’తో సొంతమైంది. దీంతో వరుసగా కొత్త సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది.‘
డ్రాగన్’ తర్వాత కయాదు పలు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వచ్చిన ఆఫర్లలో తనకు సరిపోయే సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ‘ఫంకీ’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.అయినా కయాదు అవకాశాల విషయంలో వెనక్కి తగ్గలేదు. నాని హీరోగా వచ్చిన ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాతో టాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. కయాదు పాత్రకు ఆశించినంత ప్రాధాన్యత లేదనే అభిప్రాయాలు కొంతమంది ప్రేక్షకుల నుంచి వినిపించాయి.ఇక కయాదు కెరీర్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వైపు కూడా విస్తరిస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్యతో పాటు శివ కార్తికేయన్ సినిమాల్లో ఆమె నటించబోతున్నట్లు సమాచారం. సూర్య హీరోగా టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 48’లో కయాదు హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అదే సమయంలో శివ కార్తికేయన్తో ‘SK27’లోనూ కయాదు నటించబోతున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు ఆమె కోలీవుడ్ కెరీర్కు కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు ‘డ్రాగన్’ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ కయాదు ఖాతాలో ఒకటే ఉందనే చర్చ ఉంది. అయినప్పటికీ చేతినిండా అవకాశాలు ఉండటం మాత్రం ఆమెకు ప్లస్ పాయింట్గా మారింది.
అయితే వరుస అవకాశాలు రావడం ఒక ఎత్తైతే.. వాటిని విజయాలుగా మార్చుకోవడం మరో ఎత్తు. ఒక హీరోయిన్కు వరుసగా సినిమాలు రావడం కంటే.. ఆ సినిమాల్లో బలమైన పాత్రలు, విజయవంతమైన ప్రాజెక్టులు ఉండటం కెరీర్ను మరింత స్థిరపరుస్తుంది.ఇప్పుడు కయాదు ముందున్న ఛాలెంజ్ కూడా ఇదే. ‘డ్రాగన్’తో వచ్చిన క్రేజ్ను నిలబెట్టుకుంటూ.. టాలీవుడ్, కోలీవుడ్లో చేస్తున్న సినిమాలతో మరో భారీ కమర్షియల్ సక్సెస్ను అందుకోగలరా? సూర్య, శివ కార్తికేయన్ సినిమాలు ఆమెకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


