పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారితో పాటు సారికి వీధి, మేదర వీధి, సౌందర్య థియేటర్ వెనుక ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. బైపాస్ కాలనీలోని ఓ హాస్టల్‌లోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాయుడు వీధిలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
మరోవైపు భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జియ్యమ్మవలస మండలం గెడసింగుపురం సమీపంలోని రాళ్లగెడ్డ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే మార్గంలో వీరఘట్టం వెళ్లాల్సిన అంబులెన్స్ వరద ప్రవాహాన్ని దాటలేక వెనుదిరిగింది. బ్రిడ్జి ఎత్తు తక్కువగా ఉండటంతో భారీ వర్షాల సమయంలో తరచూ ఈ సమస్య ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.


