బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన తర్వాత ఈ బాలీవుడ్ భామ తెలుగులో సినిమాలు చేస్తుందని టాక్ వినిపించింది కానీ.. ఇంత వరుకు తెలుగులో కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. లేటెస్ట్ గా ఆలియా రూటు మార్చిందని.. ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. రూటు మార్చి ఆలియా ఏం చేయబోతుంది..?
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం పలు హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పటి వరుకు బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు రూటు మార్చి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టబోతుందని.. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలిసింది. తాజాగా ఆలియా భట్ తెలుగులో రెండు భారీ చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పిందనేది ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న కల్కి 2లో దీపికా పదుకొణె స్థానంలో ఆలియా భట్ నటించనున్నట్లు సమాచారం. అయితే.. దీని పై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ప్రభాస్ ఇతర సినిమాలతో చాలా అంటే చాలా బిజీగా ఉండటంతో కల్కి 2 షూటింగ్ వాయిదా పడింది. సరైన సమయంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. తాజా సమాచారం ప్రకారం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో కూడా ఆలియా భట్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం పై చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టుగా తెలిసింది. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆలియా భట్ రెండు భారీ క్రేజీ సినిమాలు డ్రాగన్, కల్కి 2లో నటిస్తే.. టాలీవుడ్లో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయం.


