గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా…? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా…? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు…? జెన్ జీ ఓట్లను ఏ విధంగా దక్కించుకోవాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేస్తోందా…? బీసీ నినాదం తెరపైకి వచ్చిందా.? ఇంతకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో ఉన్న నేతలు ఎవరు…? దీనిపై హస్తం పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది…?
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు దృష్టి సారించాయి. బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే సమాలోచనలు చేస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని పీసీసీని ఏఐసీసీ ఆదేశించింది. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలపై పీసీసీ పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. ఇక ఖమ్మం, నల్గొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. సెప్టెంబర్ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రెండు పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం, వరంగల్,నల్గొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ప్రస్తుతం ఈ స్థానం అధికార కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. దీంతో ఇప్పుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం అధికార పార్టీకి సవాల్ గా మారింది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత, జెన్ జీ, నిరుద్యోగుల ఓట్లు కీలకంగా ఉంటాయి. దీంతో వీరి మద్దతును పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని హస్తం పార్టీ భావిస్తోంది. మరోవైపు ఆశావహులు ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. పీసీసీ పెద్దలను కలుస్తూ తమ పేరును పరిశీలించాలని కోరుతున్నారు.
ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్ట భద్రుల పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆ తర్వాత బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఐదు లోక్ సభ స్థానాల్లోను కాంగ్రెస్ గెలిచింది. అయితే ఎమ్మెల్యేల్లో కేవలం ఇద్దరు మాత్రమే బీసీలు గెలిచారు. ఆలేరులో బీర్ల ఐలయ్య, వరంగల్ ఈస్ట్ నుంచి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాత్రమే బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు. ఐదు లోక్ సభ స్థానాల్లోను బీసీలు ఎవరూ లేరు. దీంతో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానం బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బీసీలకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఈ అంశాన్ని గ్రాడ్యుయేట్ ఓట్లర్ల వద్దకు సానుకూలంగా తీసుకు వెళ్లవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రేసులో ఉన్న వారిలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ లోకేష్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన లోకేష్ యాదవ్ ఓయూ జెఏసీ నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లారు. అంతే కాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఆశీస్సులు ఉన్నాయి. దీంతో పాటు మంత్రి వర్గంలో యాదవులకు అవకాశం లేదు కాబట్టి తనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. అదే విధంగా ఖమ్మం లోక్ సభ టిక్కెట్ రేసులోను డాక్టర్ లోకేష్ యాదవ్ పేరు వినిపించింది. ఇప్పుడు పట్ట భద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. బీసీ కోటాలో తనకు టిక్కెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. తన తండ్రి గుత్తా సుఖేందర్ రెడ్డి పరిచయాలు తనకు కలిసి వస్తాయని గుత్తా అమిత్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టూరిజం కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,స్టేషన్ ఘన్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన సింగాపురం ఇందిర, మరో బీసీ నేత చనగాని దయాకర్ పేర్లు సైతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపుతుందనే దానిపై ఆసక్తి పెరుగుతోంది.


