బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు… బీజేపీ మాస్టర్ ప్లాన్

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో అనూహ్యమైన, కీలకమైన సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. ఊహించని రీతిలో పలువురు సీనియర్ నాయకులకు జాతీయ బృందంలో సముచిత స్థానం దక్కగా, మరికొందరిపై అధిష్టానం వేటు వేసింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిరిగి జాతీయ కార్యవర్గంలోకి ప్రవేశించగా, సీనియర్ నేత రాం మాధవ్‌తో పాటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కీలకమైన బాధ్యతలు దక్కాయి. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయను బాధ్యతల నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భారీ సంస్థాగత మార్పుల ప్రక్రియ ముగియడంతో ఇక తదుపరి అడుగు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన వైపే పడనుంది. వాస్తవానికి ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడో జరగాల్సి ఉన్నప్పటికీ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కారణంగా కొంత జాప్యం జరిగింది. తాజాగా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ఆర్పీఐ అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సైతం త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విస్తరణలో ఎన్డీయే మిత్రపక్షాలైన ఎన్సీపీ వంటి పార్టీలతో పాటు, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన యువ నాయకులకు పెద్దపీట వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.

కేంద్ర కేబినెట్‌లో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోందనడానికి రాజధానిలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలే బలమైన సంకేతాలుగా నిలుస్తున్నాయి. విద్యాశాఖ బాధ్యతల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడంతో ఆ శాఖను అదనంగా ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. అటు రాజ్యసభ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మంత్రులు రవ్‌నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే పలువురు కేంద్ర సహాయ మంత్రులను ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించి పార్టీ సంస్థాగత పదవుల్లోకి తీసుకువచ్చారు. మరోవైపు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్‌ను పార్టీ జాతీయ కోశాధికారిగా నియమించడంతో ఆయన మంత్రి పదవిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో జేపీ నడ్డా విషయంలో అనుసరించినట్లుగా ఒక వ్యక్తికి రెండు పదవుల మినహాయింపు సూత్రాన్ని అమలు చేస్తే తప్ప, గోయల్‌కు మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు జరగబోయే కీలక రాష్ట్రాల నుంచి సమర్థులైన కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా పాలనలో, పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని అధినాయకత్వం భావిస్తోంది.

జాతీయ స్థాయిలో జరిగిన ఈ భారీ సంస్థాగత మార్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేశాయి. నూతనంగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కలేదు. మొన్నటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ కీలక బాధ్యతల్లో కొనసాగారు. అయితే కొత్త టీమ్‌లో ఈ ముగ్గురు కీలక నేతల పేర్లూ గల్లంతవడం తీవ్ర చర్చకు దారితీసింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ ఏకైక లక్ష్యమని, దక్షిణాదిలో తెలంగాణను తమ ప్రధాన గేట్‌వేగా మారుస్తామని పదేపదే ప్రకటించే బీజేపీ అధిష్టానం.. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల సామాజిక సమీకరణాల కోసమే జాతీయ కమిటీలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ, రాష్ట్ర నేతలకు మొండిచేయి చూపడంపై కేడర్‌లో ఒకింత గందరగోళం నెలకొంది.

తెలంగాణ నేతలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడం వెనుక అధిష్టానం ఒక లోతైన వ్యూహాత్మక లెక్కను సిద్ధం చేసుకున్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నిర్దిష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించడంలో నేతలు విఫలమయ్యారన్న అసంతృప్తి ఒక కారణమైతే.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు అదనపు ప్రాధాన్యం ఇవ్వడానికే పార్టీ పదవులకు దూరం పెట్టారన్న బలమైన చర్చ నడుస్తోంది. దీనికి తాజా నియామకాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆ స్థానాన్ని ఏపీకి చెందిన పురంధేశ్వరికి అప్పగించారు. అంటే ఏపీ నుంచి కేబినెట్‌లోకి కొత్త వారికి అవకాశం ఉండదన్న సంకేతం ఇస్తూనే, మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేయడానికే ఆమెను పార్టీ పదవి నుంచి తప్పించారనే ప్రచారం జోరందుకుంది. ఇక జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కోల్పోయిన బండి సంజయ్‌కు తిరిగి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయన స్థానంలో ఈటల రాజేందర్.. లేదంటే ధర్మపురి అర్వింద్‌లలో ఒకరికి మోదీ కేబినెట్‌లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ, సీనియర్ లీడర్లందరినీ జాతీయ కమిటీకి దూరం చేయడం వెనుక హైకమాండ్ మాస్టర్ ప్లాన్ దాగి ఉందని రాష్ట్ర నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. పార్టీ పదవులు దక్కకపోవడమే కేంద్ర కేబినెట్ ఆశలను అమాంతం పెంచిందని భావిస్తున్న కమలనాథులు.. తమవంతుగా ఢిల్లీ పెద్దల వద్ద ముమ్మర లాబీయింగ్ ప్రారంభించారు. రాబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం.. మంత్రివర్గ విస్తరణ ద్వారా అసలు సిసలు పొలిటికల్ గేమ్‌ను ప్రారంభించబోతోంది. ప్రస్తుత సిట్టింగ్ కేంద్ర మంత్రుల పనితీరును బేరీజు వేస్తూ, రాష్ట్రంలో పార్టీని నడిపించేందుకు సరైన టీమ్‌ను సిద్ధం చేస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని స్పష్టమవుతోంది. ఈ పొలిటికల్ రేసులో అమాత్య యోగం ఎవరిని వరిస్తుంది, రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Latest Articles

ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్‌

కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్