భారత్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆహార ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. గత 20 రోజుల్లో కిలో చక్కెర ధర 10.16 శాతం, పాల ధర 6.12 శాతం, పప్పుధాన్యాల ధరలు 4.68 శాతం, పిండి ధరలు 6.67 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే.. ధరలు పెరగడం ఖాయం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని.. ఆహార పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సూపర్ ఎల్‌నినో ప్రభావం డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ఎల్‌నినో ప్రభావం వచ్చే వేసవి చివరి వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. దీంతో 2027 జూన్ వరకు పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం కొనసాగే అవకాశముందని సూచిస్తున్నారు. ఇక 2027లో పప్పుధాన్యాలు, చెరకు దిగుబడులపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
2027లో పరిస్థితులపై ఆందోళనగా ఉందని.. ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. రబీ సీజన్‌లో శనగ పంట దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చెరకు పంటపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చని స్పష్టం చేశారు. మరోవైపు, సోయాబీన్, వేరుశనగ పంటల దిగుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చక్కెర మిల్లుల ధరలు 30 శాతం పెరిగే అవకాశం ఉంది పలువురు చెబుతున్నారు.
చక్కెర ఉత్పత్తి, సరఫరా పరిస్థితులు రాబోయే రెండేళ్లపాటు సవాలుగా మారవచ్చని, 2027–28 ఆర్థిక ఏడాది చివరి వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రెయిన్ ఎనర్జీ నివేదిక తెలిపింది. ప్రస్తుతం చక్కెర మిల్లుల వద్ద కిలో ధర 42గా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో 55కు చేరింది. 2027 జూన్ నుంచి అక్టోబర్ మధ్య మిల్లుల వద్ద చక్కెర ధరలు గరిష్ఠంగా 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశలు, మేఘాల ఏర్పాటులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడి వ్యవసాయ ఉత్పత్తులు, నీటి లభ్యత, విద్యుత్ డిమాండ్‌పై ప్రభావం పడుతుంది.
జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం విద్యుత్ రంగానికి రెండు విధాలుగా ఇబ్బందులున్నాయి. నీటి లభ్యత తగ్గితే జలవిద్యుత్ ఉత్పత్తి వాటా తగ్గే ప్రమాదం ఉంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విద్యుత్ వినియోగం, డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ కొరత, వాడకం వంటి సమస్యను ప్రజలు, ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ దిగుబడులు, ఆహార సరఫరా, ధరల స్థిరత్వం, విద్యుత్ ఉత్పత్తిపై ఒత్తిడి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షపాతం, జలాశయాల నీటిమట్టాలు, పంటల దిగుబడులపై రాబోయే నెలల్లో పరిస్థితులు ఎలా మారుతాయన్నది కీలకం కానుంది.


