తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. 7 నెలల విరామం తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. చాలా కాలం తర్వాత బుధవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు.
కేసీఆర్ అధ్యక్షతనబిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు.
25 ఏళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణ గురించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన అంశాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
పాస్‌పోర్ట్ ఆఫీసుకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సాధారణ పాస్ పోర్ట్ తీసుకోనున్నారు. సీఎం హోదాలో డిప్లొమాటిక్ పాస్ పోర్టును 2016లో తీసుకున్నారు. సీఎం హోదాలో చైనా, సింగపూర్, మలేసియా దేశాల్లో పర్యటించింది కేసీఆర్ బృందం. ఇప్పుడు సీఎం హోదాలో లేకపోవడంతో సాధారణ పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లబోతున్నారు. అక్కడ చదువుకుంటున్న ఆయన మనవడు హిమాన్షు దగ్గర కొన్ని రోజులు గడపనున్నారు.
ఉదయం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్.. పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. పాస్ పోర్ట్ ఆఫీసు నుంచి నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.