అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌ను నడిరోడ్డున వదిలేయడానికి సిద్ధమయ్యారు. రష్యాతో చెలిమికి ఆయన తహతహలాడుతున్నారు. రష్యాను బలహీన పరచడానికే అమెరికా, నాటో దేశాలు ఇంతకాలం ఉక్రెయిన్‌ను పావుగా వాడుకున్నాయి. వారు ఆడమన్నట్లు ఆడిన ఉక్రెయిన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకొంటోంది.మొన్న వైట్ హౌజ్ ఓవెల్ ఆఫీస్ లో గొడవ తర్వాత ఉక్రెయిన్ కు సాయం నిలిపివేశారు ట్రంప్. ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు పంపుతున్న ఆయుధాలను ఆపేస్తున్నట్లు వైట్ హౌజ్ ప్రకటించింది.
ఒకరు అగ్రరాజ్యానికి అధినేత, ఇంకొకరు యుద్ధాన్ని ఎదుర్కొంటున్న దేశానికి అధ్యక్షుడు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. అధికారిక సమావేశంలో మీడియా ముందే వాగ్వాదానికి దిగారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. దీంతో వైట్‌హౌస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.. డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ ఇరువురు నేతలు కూడా తగ్గేదే లేదంటూ.. మీడియా ఎదుటే ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకున్నారు. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఖనిజాల ఒప్పందమే ప్రధాన అజెండాగా డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు. చర్చల అనంతరం అధ్యక్ష కార్యాలయం ఓవల్ ఆఫీస్‌కు చేరుకున్న ఇరువురు నేతలు..మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జెలెన్‌స్కీ.. ఒప్పందం కుదుర్చుకో.. లేదంటే తాము బయటకు వెళ్లిపోతాం అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందన్న ట్రంప్.. దాన్ని నుంచి గట్టెక్కడం అసాధ్యమని హెచ్చరించారు. దానికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధం సాక్షిగా జరిగిన తగాదా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 1971, అక్టోబర్‌లో అప్పటి పాక్ సైనిక ప్రభుత్వం, తూర్పు పాకిస్థాన్‌లో జరుపుతున్న నరమేధంపై నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్, భారత ప్రధాని ఇందిరాగాంధీకి మధ్య తీవ్రస్థాయిలో జరిగిన చర్చను ఇది గుర్తు చేసింది. ఎవరు దురాక్రమణకు దిగారు, ఎవరు బాధితులనేది అప్పటి అమెరికా అధ్యక్షుడైన నిక్సన్ పట్టించుకోలేదు. ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్ కూడా పట్టించుకోవడం లేదు.
స్పష్టంగా చెప్పాలంటే అమెరికాకు ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివే. ట్రంప్ వృత్తిపరమైన రాజకీయవేత్త కాదు, ఆయన ఓ బిజినెస్ మెన్. ఏదైనా పని తలపెట్టాలంటే దానివల్ల కలిగే లబ్ధి ఏమిటనేది చూడటం ట్రంప్ లక్షణం. ఇక్కడ శాంతి పేరిట ఒక ఒప్పందం లాంటిది ట్రంప్ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. అది పూర్తిగా రష్యాకు అనుకూలంగా, ఉక్రెయిన్‌కు, తద్వారా నాటో దేశాలకు భద్రతా పరంగా వ్యతిరేకంగా ఉందని అర్థమవుతోంది. కానీ, ట్రంప్ అవేవీ పట్టించుకోవడం లేదు. అమెరికా అందించిన సాయం పూర్తిగా పనికిరాకుండా పోయినట్లు ట్రంప్ వాపోతున్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయమే అందించింది. అందుకు సరైన కృతజ్ఞత ఉక్రెయిన్ నుంచి రావడం లేదనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఆ కృతజ్ఞతా భావం ఏ రూపంలో రావాలని ట్రంప్ ఆశిస్తున్నారనేది ఆలోచిస్తే అసలు సంగతి అర్థమవుతుంది.
ఉక్రెయిన్‌లో ఉన్న ఖనిజ సంపదను, మరీ ముఖ్యంగా అధునిక సాంకేతికతకు కీలక వనరైన లిథియం గనులను అమెరికాకు అప్పగించాలనేది ట్రంప్ పంతం. అంటే, అమెరికా చేసిన సాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ తన సహజ సంపదలను తమకు ధారాదత్తం చేయాలనడం ఒక రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ధోరణిని తలపిస్తోంది. మరీ ఇంత బహిరంగంగా, మీడియా సమక్షంలో జరిగిన చర్చలో ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ డిమాండ్లను ముందుకుతేవడం కొంచెం విచిత్రంగానే అనిపిస్తున్నప్పటికీ, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా ట్రంప్ అదే ఆలోచిస్తున్నారు. మీడియా సమావేశంలో జరిగిన వాగ్వాదంలో ట్రంప్ డిమాండ్లను జెలెన్‌స్కీ నిరాకరించడం సబబే అని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే ట్రంప్ ఈ స్థాయిలో దాదారిగి చేస్తున్నప్పుడు దానికి తాను బహిరంగంగా తలొగ్గినట్టు కనిపించడం ఏ అధ్యక్షుడికీ ఇష్టం ఉండదు. అలాంటి చర్య ఉక్రెయిన్‌లో జెలన్‌స్కీ పరపతిని పూర్తిగా ధ్వంసం చేస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. ఈ మాటల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడిని, ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందాన్ని అవమానకరమైన రీతిలో బయటకు పంపించి వేశారనే వార్త మరింత విస్మయం కలిగిస్తోంది.
యుద్ధ సాయం విషయంలో అమెరికా వెనక్కి తగ్గడం వల్ల అటు నాటోలోనూ లుకలుకలు బయలుదేరాయి. ట్రంప్ మొదటి నుంచీ నాటోకు వ్యతిరేకమే. నాటోలాంటి గుదిబండలు అమెరికాకు అవసరం లేదన్నది ట్రంప్ ఆలోచన. ట్రంప్ ధోరణి పట్ల మొదట్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, ఉక్రెయిన్ విషయంలో ముందుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై నాటో దేశాల్లోనూ తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన సాయానికి కృతజ్ఞతగా ఉంటామని జెలెన్‌స్కీ చేసిన తాజా ప్రకటనను నిస్సహాయస్థితిలో వ్యక్తమైన అనివార్యతగా భావించాలి. వైట్‌హౌస్‌లో ఒప్పుకోనప్పటికీ, మరో రకంగా అమెరికా ముందు ఉక్రెయిన్ మోకరిల్లక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అన్నది నిజానికి దగ్గరగా ఉన్న అనుమానం.
అయితే, అమెరికా ఇలా బాహాటంగా తనకు ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని తెగింపు చూపడం ప్రపంచ దేశాలను సమస్యల నుంచి బయటపడేయడం మాటేమో గానీ మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోయేలా చేసే అవకాశం ఉంది.