రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వైద్య సంరక్షణ , మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. సమాజంలోని పేద వర్గాల ప్రజలకు, ముఖ్యంగా అవసరమైన మందుల విషయంలో సరసమైన ధరలకు మందులను అందించడంలో రాష్ట్రాలు విఫలమవడంపై తీవ్ర విమర్శలు చేసింది.
ఈ వైఫల్యం “ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించింది” అని కోర్టు పేర్కొంది.
ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ , ఎన్.కె. సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
రోగులను ఆసుపత్రి ఫార్మసీల నుండి మాత్రమే కొనుగోలు చేయమని బలవంతం చేయవద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దారుడు తన పిల్‌లో కోరాడు. కేంద్రం , రాష్ట్రాలు నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని, దీని ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని కూడా ఆరోపించారు.
“మేము మీతో ఏకీభవిస్తున్నాము… కానీ దీన్ని ఎలా నియంత్రించాలి?” అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించరు.
సరైన వైద్య సంరక్షణను అందించడం రాష్ట్రాల విధి అని కోర్టు పేర్కొంది. కొన్ని రాష్ట్రాలు అవసరమైన వైద్య సంరక్షణను అందించలేకపోయాయని ఇది.. ప్రైవేట్ సంస్థలకు సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించాయని” కూడా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి సంస్థలను నియంత్రించాలని కోర్టు ఆదేశించింది.
ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను , వారి కుటుంబాలను ఇన్-హౌస్ ఫార్మసీల నుండి కొనుగోలు చేయమని బలవంతం చేయకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేకించి అదే మందు వేరే చోట చౌకగా అందుబాటులో ఉన్నప్పుడయితే ఇలాంటివి జరగకూడదని సూచించింది.
అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు , వైద్య సంస్థలు.. పౌరులను దోపిడీ చేయకుండా ఉండటానికి మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, ఇది తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేయకపోయినా.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడం అవసరమని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలోనూ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.