చట్టాలు చేయాల్సిన చోటను యూపీ ఎమ్మెల్యేలు అపవిత్రం చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ఎమ్మెల్యేలే సాక్షాత్తు దేవాలయం లాంటి శాసనసభలో పాన్ మసాలా తినడమే కాకుండా…. తలుపుల సందుల్లో దాన్ని ఉమ్మివేశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని అసెంబ్లీలో జరిగింది.
ఘటనపై యూపీ స్పీకర్ సతీశ్ మహానా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆ మరకలను పరిశీలించిన స్పీకర్… ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని ఇతర ఎమ్మెల్యేలను కోరారు. తాను సీసీ ఫుటేజీలో చూశానని… ఎవరినీ కించపరచడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరి పేరునూ తాను తీసుకోవడం లేదని… వారు ఈ పని చేయడం మానేయాలని సూచించారు. ఎవరైనా అలాంటి పనిచేస్తే ఆ చర్యను మిగతా ఎమ్మెల్యేలు అడ్డుకోవాలన్నారు.
“ఈ ఉదయం, మన విధాన సభలోని ఈ హాలులో కొంతమంది సభ్యులు పాన్ మసాలా తిన్న తర్వాత ఉమ్మివేసినట్లు నాకు సమాచారం అందింది. కాబట్టి, నేను ఇక్కడికి వచ్చి శుభ్రం చేయించారు. వీడియోలో ఎమ్మెల్యేను చూశాను. కానీ నేను ఎవరినీ అవమానించాలనుకోవడం లేదు. కాబట్టి, నేను వారి పేరును ఉపయోగించడం లేదు. ఎవరైనా ఇలా చేయడం చూస్తే, వారిని ఆపాలని నేను సభ్యులందరినీ కోరుతున్నాను… ఈ అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత… సంబంధిత ఎమ్మెల్యే వచ్చి వారు ఇలా చేశారని నాకు చెబితే మంచిది. లేకుంటే, నేను వారికి ఫోన్ చేస్తాను” అని ఆయన అన్నారు.