తెల్లవారక ముందే పల్లె లేస్తుంది. ఈ పల్లెను ప్రభాత సమయంలో కొక్కొరోకో పిలుపులతో మేలుకొలుపు పలికేవి కుక్కుటాలు. అందరిని తెల్లవారుజామునే నిద్ర లేపే గురుతర బాధ్యతలు తీసుకుని, విశిష్ట సేవలు అందిస్తున్న కోళ్లకు శాశ్వత విశ్రాంతి ఇచ్చేసి, మళ్లీ కళ్లు తెరవలేనంత గాఢ నిద్రలోకి పంపించేసింది ఓ మాయదారి కొక్కెర. కొక్కెర అంటే అదేదో కుక్కుట జాతి శత్రువో, కోళ్ల వైరి వర్గానికో చెందినదో కాదు. కోళ్ల పాలిట దాపురించిన ఓ భయంకర వ్యాధి. రంగారెడ్డి జిల్లా నానక్ నగర్ లో కొక్కెర వ్యాధి బారిన పడి ఏకంగా పన్నెండు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.
ఓ వైపు బర్డ్ ఫ్లూ కలకలం, మరో వైపు కొక్కెర వ్యాధి స్వైరవిహారం.. దీంతో, యాచారం మండలం నానక్ నగర్ లో వేల కోళ్లను కోల్పోయి పౌల్ట్రీ రైతులు కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. దాదాపు పన్నెండు వేలకు పైబడి బాయిలర్ కోళ్లు వీవీఎన్ డీ అనే దిక్కుమాలిన కొక్కెర వ్యాధి బారిన పడ్డాయి. మూగ జీవాలు విగత జీవాలుగా మారడంతో.. పౌల్ట్రీ లు జంతు శ్మశాన వాటికల్లా మారాయి. వేలాది కోళ్లు మృత్యువాత పడడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్టు పౌల్ట్రీ రైతులు వాపోయారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
ఇదే పల్లెలో ఇటీవల ఓ ఫామ్ లో ఏడు వేల కోళ్లు మృతి చెందగా, ఆ పౌల్ట్రీ యజమానికి దాదాపు పది లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు వెల్లడైంది. అయితే, ఈ విషయం ఇంతవరకు తన దృష్టికి రాలేదని.. ఇప్పుడు ఆయా గ్రామాలకు వెళ్లి పరిశీలన చేసి, పరిస్థితులు తెలుసుకుంటానని పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ లోని ఓ ఫామ్ లో మూడు వేల నాటు కోళ్లు ఆకస్మికంగా మృత్యువాత పడ్డాయి. దీంతో, ఈ పౌల్ట్రీ రైతుకు దాదాపు ఎనిమిది లక్షల మేర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనే సామెత, సామెతగానే మిగిలిపోతోంది. ఆకస్మిక పరిణామాలతో నష్టాలు జరిగి పోతున్నాయి, కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి. వింత రోగాలు ఒక్కసారిగా విజృంభించేస్తుంటే, సంతలో వింతలు చూసినట్టు చోద్యం చూస్తూ కూర్చోక.. ఆఘమేఘాల మీద నివారణ చర్యలు చేపట్టాలి. తిరిగి ఆ ప్రమాదాలు వాటిల్లకుండా ఏం చేయాలో ఆలోచనలు సాగించాలి. శాస్త్రవేత్తలు, మేధావుల సూచనలకు అనుగుణంగా వెళ్లి.. ముందు జాగ్రత్తలు పాటించాలి. తిరిగి ఆ దురదృష్ట పరిణామాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి. ఇవీ… పలువురు జంతు ప్రేమికులు తెలియజేస్తున్న మంచి విషయాలు.