యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారతదేశానికి చెందిన మహిళ షెహజాది ఖాన్‌కు మరణశిక్ష అమలైంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఆమె చివరి కోరిక మేరకు షెహజాదికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ఫిబ్రవరి 14న చివరిసారిగా ఆమె ఇంటికి ఫోన్ చేసింది. అక్కడి ప్రభుత్వం తనకు త్వరలోనే మరణ శిక్ష అమలు చేయబోతుందని తన తండ్రికి చెప్పింది. అయితే ఆ మరుసటి రోజే ఆమెకు మరణ శిక్ష అమలు చేసినట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. నాలుగు నెలల చిన్నారి మృతి కేసులో ఈ శిక్ష అమలైంది.
ఏం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన షెహజాది అబుదాబీకి వెళ్లి ఓ ఇంట్లో పనికి చేరారు. ఆ ఇంటి యజమాని దంపుతులకు శిశువు జన్మించగా షెహజాది సంరక్షకురాలిగా ఉండేది. 2022 డిసెంబరు 7న ఆ చిన్నారికి నాలుగు నెలలున్నప్పుడు టీకాలు వేయించారు. అయితే అదే రోజు సాయంత్రం అనూహ్యంగా శిశువు మృతి చెందింది. దీంతో తమ బిడ్డ మృతికి కారణం షెహజాదే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను జైలుకు తరలించారు. శిశువుకు పోస్టుమార్టం చేసి మరణానికి కారణాలు కనుగొనడానికి కూడా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. యూఏఈ ప్రభుత్వం గతేడాది జులైలో మరణశిక్ష ఖరారు చేసింది.
అక్కడి చట్టాల ఆధారంగా షెహజాదికి మరణ శిక్ష ఖరారు చేశారు. చివరిసారిగా ఆమె ఫిబ్రవరి 14న తల్లిదండ్రులతో మాట్లాడింది. తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. తన కుమార్తెను కాపాడాలని తన తండ్రి షబ్బీర్ ఖాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అసలు తన కుమార్తె బతికే ఉందా లేదా అనే సంగతి తెలుసుకొనే ఉద్దేశంతో షబ్బీర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. షెహజాదీని ఫిబ్రవరి 15నే ఉరితీశారని భారత విదేశీ వ్యవహరాల శాఖ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. అది ఎంతో దురదృష్టకరమని న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా విచారం వ్యక్తం చేశారు.