భారత్ అంటే తనకెంతో ఇష్టమన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. ఏప్రిల్ రెండు నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తేల్చి చెప్పారు. భారతదేశంతో కొన్ని సంవత్సరాలుగా ఉన్న మైత్రీ బంధాన్ని కూడా ట్రంప్ పక్కన పడేశారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా పదవి చేపట్టిన ఆరు వారాల్లోనే తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ఆయన వెల్లడించారు. బైడెన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో సాధించలేనిది కేవలం ఆరు వారాల వ్యవధిలో తమ ప్రభుత్వం సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనేక దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్నారు ఆయన.భవిష్యత్తులో అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ వెల్లడించారు.
కొంతకాలంగా అమెరికా పై ఇతర దేశాలు సుంకాలు విధించాయన్నారు అధ్యక్షుడు ట్రంప్. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. ఇప్పుడు అమెరికాకు టైమ్ వచ్చిందన్నారు. దీంతో ఇతర దేశాలపై తాము కూడా సుంకాల విధిస్తున్నామన్నారు. ఈ విషయంలో అమెరికాను తప్పు పట్టే అర్హత ఏ ఇతర దేశానికి లేదని తేల్చి చెప్పారు ట్రంప్. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆయన. భారత్ తో పాటు చైనా పై కూడా ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలియచేశారు. ఇతర దేశాలు, అమెరికా పై ఏమేరకు సుంకాలు విధిస్తే , తాము కూడా అదే స్థాయిలో వడ్డిస్తామన్నారు. అంతిమంగా రెసిప్రోకల్ టారిఫ్ ల అమెరికా కు ఆదాయం పెరుగుతుందని అధ్యక్షుడు వెల్లడించారు. ప్రపంచపటంపై అమెరికా మరింత సంపన్నదేశం అవుతుందన్నారు. అధ్యక్షుడిగా అమెరికా ప్రయోజనాలే తనకు ప్రయారిటీ అని తేల్చి చెప్పారు డొనాల్డ్ ట్రంప్.
ఈ ఏడాది జనవరి 20 న అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో పెనుమార్పులు జరుగుతన్నాయని కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ట్రంప్ పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో అమెరికా లో పరిపాలన గాడి తప్పిందని పరోక్షంగా బైడెన్ నుద్దేశించి ట్రంప్ కామెంట్ చేశారు. పాలనను తిరిగి పట్టాలెక్కించడమే తాను చేసిన మొదటి పని అని ఈ సందర్బంగా ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని ట్రంప్ వెల్లడించారు. అమెరికాకు పాత రోజులు మళ్లీ వచ్చాయన్నారు. అమెరికాకు పునర్వైభవం తీసుకురావడానికి తాను చేస్తున్న కృషి ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు ట్రంప్.
కాగా ఈ సందర్భంగా డోజ్ సంస్థ అధినేత ఎలన్ మస్క్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అనేక ఉన్నత లక్ష్యాలతో డోజ్ సంస్థ ఏర్పాటు చేశామన్నారు.అలాగే డోజ్ సంస్థ కు ఎలన్ మస్క్ అధినేతగా ఎంపిక చేశామన్నారు. తనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించడానికి ఎలన్ మస్క్ రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని ట్రంప్ అభినందించారు. అలాగే ప్రథమ మహిళ మెలానియాపై కూడా ట్రంప్ ప్రశంసలు కురిపించారు.