ఏపీలో ప్రతీకార రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయా? మాజీ మంత్రి విడుదల రజనిపై ఉచ్చు భిగుస్తుందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇప్పటికే వైసీపీ హాయంలో నోటి దురుసు ప్రదర్శించిన వంశీ, పోసానిపై చర్యలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజని కావొచ్చనే ప్రచారం జరుగుతుంది. బెదిరింపులు, అక్రమ వసూళ్ల కేసులో ఆమెను నిందితురాలిని చేసేలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆమెతో పాటు ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై కేసు పెట్టాలని ఓ స్టోన్ క్రషర్ ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి 2 కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి కూడా తీసుకుంది. విడదల రజనిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. గవర్నర్ నుంచి అనుమతి రావడంతోనే కేసు నమోదు చేయవచ్చునని భావిస్తున్నారు.
వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన విడుదల రజనీ.. తన అధికారాలు ఉపయోగించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇప్పటికే దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మంత్రిగా ఉన్నప్పుడు రజనీ కోట్లాది రూపాయలు డిమాండు చేసి.. వసూలు చేశారని.. వారికి ముట్టిన డబ్బులో రజనికి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజని పీఏకు 10 లక్షలు అందినట్లు స్పష్టమైంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేసు నమోదు కోసం అవసరమైన అనుమతుల్ని ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు.
విడుదల రజనితో ఎప్పుడెప్పుడు మాట్లాడారు.. ఆమె పీఏ ఎలా క్రషింగ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారనే విషయాలను బాధితులు పూసగుచ్చినట్లు వివరించారు. క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే పార్టీకి ఫండ్ ఇవ్వాలని రజని పీఏ అడిగారని, అడిగిన వెంటనే ఇవ్వలేదని.. గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పల్లె జాషువా వచ్చి తనిఖీలు చేసినట్లు చెబుతున్నారు. పైగా క్రషర్‌లో అవకతవకలు ఉన్నాయని చెప్పి 50 కోట్ల జరిమానా చెల్లించాలని జాషువా యజమానులను బెదిరించినట్లు బహిర్గతమైంది.
విడుదల రజని తరపున జాషువా పలు మార్లు ఫోన్లు చేసి జరిమానా విధించి.. క్రషర్ సీజ్ చేయాలా? లేదంటే రజిని చెప్పినట్లు చేస్తారా అని బెదిరించారని కూడా చెప్పారు. జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్‌క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని హెచ్చరించినట్టు యాజమాన్యం ఆరోపించింది. ఇదే విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగింది.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత అత్యంత ఎక్కువ ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి విడుదల రజినీనే. ఎంతో మంది జగన్ కేబినెట్‌లో పని చేసినా.. వారి ఎవరిపై పెద్దగా రాని ఫిర్యాదులు.. రజని విషయంలో వస్తున్నాయి. ఆమె బెదిరింపులు, అక్రమ వసూళ్లు తారా స్థాయిలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం విడుదల రజిని విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. త్వరలోనే రజని అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో రజిని అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.