తెలంగాణలో మెజార్టీ సీట్లను దక్కించుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే పార్టీలో భారీ ప్రక్షాళనకు రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టింది. కొత్త టీం తో ఎన్నికలకు వెళ్లి తామనుకున్న టార్గెట్ ను సాధించాలని కాషయదళం లోక సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది….
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర నాయకత్వం పార్టీలో పలు మార్పులు, చేర్పులు చేపట్టింది. రాష్ట్ర మోర్చాల అధ్యక్షులతో పాటు, జిల్లా అధ్యక్షుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. మైనార్టీ,కిసాన్ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులను మినహా,….. మిగతా ఆరు మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని నియమించింది. అలాగే 12 జిల్లాల అధ్యక్షులను మారుస్తూ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తామని భారీ అంచనాలు వేసింది. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో కంటే చాలా తక్కువగా వచ్చాయి. దీనికి కారణం జిల్లాస్థాయిలో ఉన్న అధ్యక్షులు పార్టీ గెలుపు కోసం పనిచేయలేదని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. కొంతమంది అధ్యక్షులు అయితే ఇతర పార్టీల అభ్యర్థులకు అమ్ముడుపోయారని ఆరోపణలు కూడా వినిపించాయి. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత జిల్లా అధ్యక్షులు వహించాలని ఈ కార్యకర్తలు అధిష్టానం పై ఒత్తిడి తెచ్చారు. జిల్లా అధ్యక్షులు బలంగా లేకపోవడం వలన పార్టీ నిర్మాణం జరగలేదని పలు సందర్భాల్లో జాతీయ నేతలు రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు కూడా చేశారు. అందువల్లనే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షుల మార్పుకు శ్రీకారం చుట్టారు.
బిజెపికి వివిధ మోర్చాల విభాగాలే బలమైనది. అందులో యువ మోర్చా మహిళా మోర్చా ఎస్సీఎస్టి మోర్చాలతోపాటు ఓ బి సి కిసాన్ మైనార్టీ మోర్ఛాలు పార్టీ గెలుపులో కీలక భూమిక పోషిస్తాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మోర్చాలకు చెందిన నేతలు ఎవరు క్రియాశీలకంగా పనిచేయలేదని పార్టీ అధిష్టానం భావించింది. ఎన్నికల కంటే ముందే జాతీయ నేతలు వివిధ మోర్చాల పదాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమయంలో ఏ విధంగా పనిచేయాలో, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలో శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కానీ మోర్చాల అధ్యక్షులు ఇతర నేతలు ఎవరు తమ విభాగాలకు చెందిన ప్రజలను ఎన్నికల సమయంలో ఆకట్టుకోలేదుకపోయారనే ఆరోపణ వినిపిస్తున్నాయి. అంతే కాదు మోర్చాల అధ్యక్షులు తమకు ఇచ్చిన పదవులను అడ్డం పెట్టుకొని సొంత రాజకీయాలను నడిపారని విమర్శలు వచ్చాయి. రాష్ట్రానికి వచ్చిన ఇన్చార్జిలు సైతం మహిళా మోర్చా తీరుపై పలు సందర్భాల్లో మండిపడ్డారు. కొంతవరకు యువ మోర్చా నేతలు నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు. ఎస్సీ మోర్చా నేతలు మాత్రం రాష్ట్ర కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎస్టి మోర్చా నేతలు మాత్రం అసలు తమ విభాగం ఉందా అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇలాంటి నేతలతో పార్లమెంటు ఎన్నికలకు పోతే ఫలితాలు రావని జాతీయ నేతలు హెచ్చరించడంతోనే ఒక్కసారిగా మోర్చాల నేతలపై రాష్ట్ర నాయకత్వం వేటు వేసింది.
రాష్ట్ర కాషాయ దళం దళపతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీలో తన మార్క్ ను చూపించుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కొంతమంది అధ్యక్షులు మార్పు ఉంటుందని పార్టీలో చేర్చ జరిగింది. కానీ ఎన్నికల సమయంలో అలాంటి మార్పులకు కిషన్ రెడ్డి దూరంగా ఉండి ఫలితాలు వచ్చిన తర్వాతనే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయని అధ్యక్షులపై వెట్ వేశారు. పార్టీలో ప్రధాన విభాగాలైన మహిళా మోర్చా యువ మోర్చా ఎస్టి ఎస్సీ మోర్చాల పనితీరు మెరుగుపరచుకోవాలని కిషన్ రెడ్డి పలుమార్లు మోర్చాల అధ్యక్షులకు సూచించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వివిధ కార్యక్రమాలను రూపొందించి ఇచ్చిన మోర్చా అధ్యక్షులు వాటిని పట్టించుకోలేదు. మోర్చాల అధ్యక్షులు నిర్లక్ష్యం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో హై కమాండ్ సైతం మోర్చా అధ్యక్షులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి టీంతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్లడం కష్టమని భావించిన కిషన్ రెడ్డి పార్టీని ప్రక్షాళన చేస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.


