ఆంధ్రప్రదేశ్ లో ఏదొక వివాదం నడుస్తూనే ఉంది. పోలీసులు ఇంటింటికి వెళ్లి ప్రజలను అడుగుతున్న ప్రశ్నలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. క్రైం రికార్డ్ కోసమని అడుగుతున్న ప్రశ్నలు మహిళల మనోభావాలను కించపరిచేవిగా ఉండటంతో వాళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
మొత్తానికి ఏపీలో రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ప్రతిపక్షాలు ఒకవైపు నుంచి యాక్టివ్ అవుతుంటే, మరోవైపు అధికారంలో ఉన్న వైయస్సార్ పార్టీకి కొన్ని శాఖల తీరుతో తలబొప్పి కడుతోంది… వివరాల్లోకి వెళితే…
ప్రస్తుతం పోలీస్ శాఖ ఏపీలో ఒక విచిత్రమైన సర్వే చేస్తోంది. ‘నేరాలకు దారితీసే పాత విరోధాల వివరాల సేకరణ’ పేరుతో ఇంటింటికి వెళ్లి కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది. ఈ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఆ ప్రశ్నలు వివాదాస్పదంగా ఉండటంతో మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.
ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే…
మీ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయా?
బహుళ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా?
ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా?
వీటికి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఇబ్బందికరమైన, సున్నితమైన ప్రశ్నలు అడగడంతో కొందరు మహిళలు అంతెత్తున లేస్తున్నారని సమాచారం. మరికొందరు శాపనార్థాలు పెడుతున్నారని, మళ్లీ ఇటు వైపు వస్తే దేహశుద్ధి తప్పదని కొందరు వార్నింగులు ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వీటితో పాటు ఆస్తి తగాదాలు, సరిహద్దు గొడవలు, గృహహింస కేసులు, మద్య సేవనం, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం కుల మత రాజకీయపరమైన విరోధాలకు సంబంధించిన కేసుల వివరాలు సేకరిస్తున్నారు.
మొత్తం 12 రకాల అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారు. వాటన్నింటినీ సంబంధిత స్టేషన్ అధికారికి సాయంత్రం అప్పగిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులైన ప్రతిపక్ష పార్టీలో వారిని చట్టపరంగా ఇబ్బందిపెట్టేందుకే ఈ సర్వే అని బహిరంగంగానే వ్యాక్యానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన ప్రశ్నల వల్ల వైసీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.