35.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

ఏసు వల్లే దేశం అభివృద్ధి చెందుతోంది: హెల్త్‌ డైరక్టర్‌ గడల శ్రీనివాస్‌ వివాదస్పద వ్యాఖ్యలు

-వైద్యం వల్ల కరోనా పోలేదని స్పష్టీకరణ
-ఏసు వల్లే దేశం అభివృద్ధి చెందుతోందన్న గడల
-వివాదమవుతున్న గడల శ్రీనివాస్‌ వ్యాఖ్యలు
-రంగంలోకి విశ్వహిందూ పరిషత్‌
-గడలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌
-కోఠి కార్యాలయం ఎదుట ధర్నా, అరెస్టులు
-తాను అలా అనలేదని గడల వివరణ
-తన వ్యాఖ్యలను కట్‌ చేశారని విమర్శ
-మతబోధకుడిలా పనిచేస్తున్నారని బండి సంజయ్‌ ఫైర్‌
-బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసమే క్రైస్తవ భజన చేస్తున్నారని విమర్శ
-గడల అవినీతి నిరూపిస్తామని సవాల్‌
-క్రైస్తవ దేశాల్లో ప్రజలను ఏసు ఎందుకు రక్షించలేదన్న బాబు గోగినేని
-గతంలోనూ గడల వైఖరిపై వివాదం
-కేసీఆర్‌కు కాళ్లు మొక్కిన వైనంపై పార్టీల ఆగ్రహం

-ఓ కార్యక్రమంలో చిందులేసి విమర్శలకు గురైన గడల
-ఇప్పుడు మళ్లీ ఏసుక్రీస్తును స్తుతిస్తూ మరోసారి వివాదంలో గడల

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన ఉన్నతాధికారి. కరోనా సమయంలో రోజూ టీవీ తెరలపైకొచ్చి, ప్రముఖుడిగా మారారు ఆ పెద్దసారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజానీకానికి మంచి చెడ్డలు బోధించే ఆ పెద్దసారు, ఇప్పుడు క్రైస్తవమత బోధకుడి అవతారమెత్తారన్న విమర్శలు కొనితెచ్చుకున్నారు. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గిందన్న ఆ సారు వ్యాఖ్యలు, ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన ‘ఏసుకీర్తనల’పై హిందూ సంఘ నేతలు, అగ్గిరాముళ్లలవుతున్నారు. అయితే.. తాను క్రీస్తు వల్ల కరోనా తగ్గిందని చెప్పలేదని, సదరు సారు సెలవిచ్చారు. ఇంతకూ ఎవరూ పెద్ద సారు? ఏమా కధ? చూద్దాం రండి.

డాక్టర్‌ గడల శ్రీనివాస్‌. తెలంగాణ హెల్త్‌ డైరక్టర్‌! కరోనా ముందు వరకూ ఆయన పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కరోనా సీజన్‌లో ఆయన పేరు మార్మోగిపోయింది. టీవీలు చూసేవాళ్లు, పేపర్లు చదివే వారికి ఆయన పేరు తెలిసిపోయింది.

ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. అందరి ఎదుటే కాళ్లుమొక్కిన వైనం, ఆయనను వివాదాస్పదుడిగా మార్చింది. వయసులో నాకంటే పెద్దయిన కేసీఆర్‌ నాకు తండ్రిలాంటివాడు. ఆయన కాళ్లు మొక్కితే తప్పేంటని, అప్పట్లో గడల కౌంటరిచ్చారు. ఒక్కసారి కాదు, వందసార్లు కాళ్లు మొక్కుతానని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్షుదపూజలు చేశారంటూ పెద్ద దుమారమే రేగింది. అలాంటిదేమీ లేదని గడల ఖండించారనుకోండి. అది వేరే విషయం.

ఇంతకూ గడల సారు వచ్చే ఎన్నికల్లో.. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి అవతారమెత్తేందుకే, ఇవన్నీ చేస్తున్నారన్నది బీజేపీ ఆరోపణ. అందుకే నిస్సిగ్గుగా కేసీఆర్‌ కాళ్లు మొక్కుతున్నారని, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు సంధిస్తున్నారు.

ఇన్ని వివాదాలు మూటకట్టుకున్న గడల సారు.. క్రిస్మస్‌ వేడుక సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ సమాజంలో పెను దుమారం రేపుతున్నాయి. వాటిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగంలోకి దిగిన హిందూ సంఘాలు, ఇప్పుడు గడలను చాకిరేవు పెడుతున్నాయి.

ఏసుక్రీస్తు వల్లనే కరోనా పోయిందని గడల సారు క్రిస్మస్‌ వేడుక సభలో సెలవిచ్చారు. ‘కరోనా పోయిందంటే అది మనం చేసిన సేవల వల్ల కాదు. ఏసుక్రీస్తు ప్రభావం. ఈ ఆధునిక సంస్కృతికి వారసులు , ఈ దేశం-రాష్ర్టానికి నిజమైన వారసులున్నారంటే అది కేవలం క్రైస్తవ సోదరులే’నని గడల సారు సెలవిచ్చారు.

మరొక అడుగు ముందుకేసిన గడల సారు.. అసలు చాలామంది దేవుళ్లున్నా మన కళ్లముందు, మన ముందు తరాలు చూసిన ఏసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడని’ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ‘ఏదో గ్రాఫిక్స్‌ రూపంలో చూడకుండా, మన పూర్వీకులు చూసిన ఏసుక్రీస్తు బోధనలు అందరికీ చేరవేయండ’ని పిలుపునిచ్చారు.

కొత్తగూడెంలో గడల సారు చేసిన ఆ శుభసందేశ ప్రసంగానికి, అక్కడయితే చప్పట్లు మార్మోగాయి. అయితే ఆ తర్వాత మొదలయిన విమర్శల వర్షంతో, ఆయన ఇంకా తడిసిముద్దవుతూనే ఉన్నారు. గడల వ్యాఖ్యలపై రంగంలోకి దిగిన విశ్వహిందూ పరిషత్‌, ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ‘ఏసుక్రీస్తు వల్లనే దేశం అభివృద్ధి చెందుతోందన్న గడల శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయాలి. ఆయన ఏసు మైకంలో ఉండి, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హిందుత్వాన్ని అవమానించిన గడల శ్రీనివాస్‌ అసలు ఏసుకు, భారతదేశ అభివృద్ధికీ సంబంధం ఏమిటో చెప్పాలి. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామ’ని వీహెచ్‌పీ తెలంగాణ అధ్యక్షుడు సురేందర్‌, ప్రధాన కార్యదర్శి పండరీనాధ్‌, ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి హెచ్చరించారు.

గడల శ్రీనివాస్‌ వ్యాఖ్యలకు నిరసనగా, కోఠి లోని ఆయన కార్యాలయం వద్ద వీహెచ్‌పీ ధర్నా నిర్వహించింది. లోపలకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యశాఖలో తన ఉద్యోగులను హిందూ క్రైస్తవులుగా విభజించి, క్రైస్తవులకు మేలుకలిగేలా మాట్లాడుతున్న గడల వ్యవహారాన్ని, తాము త్వరలో కోర్టులో తేల్చుకుంటామని వీహీచ్‌పీ ప్రచార ప్రముఖ్‌ బాలస్వామి చెప్పారు.

హెల్త్‌ డైరక్టర్‌ గడల ఏసుకీర్తనలపై, బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ భగ్గుమన్నారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా క్రైస్తవ ప్రచారకుడిగా మారిన గడలపై, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో గడల చేసిన అవినితీని తాము నిరూపిస్తామని సవాల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసమే గడల ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకే అధికారి అయి ఉండీ, సిగ్గులేకుండా సీఎం కేసీఆర్‌ కాళ్లు మొక్కారని ధ్వజమెత్తారు.

ఇక సామాజిక ఉద్యమకారుడు బాబు గోగినేని కూడా, గడల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ‘కరోనా సమయంలో పోప్‌ దాక్కున్నాడు. అత్యధిక సంఖ్యలో ఇటలీ, అమెరికాలో క్రైస్తవులు చనిపోయార’ని గుర్తు చేశారు. కరోనా నుంచి మనిషిని కాపాడింది మనిషే. ఏసుకాదు అన్నారు. ‘ఏసు నిజంగా పుట్టి ఉంటే ఆయన 2వేల ఏళ్ల క్రితమే చంపబడ్డాడు. బ్రతికి ఉన్నప్పుడు తనను తాను కాపాడుకోలేని వాడు, రెండువేల ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎవరిని కాపాడతాడు’ అని ప్రశ్నించారు. ‘అసలు ఇలా మాట్లాడున్న మీరు మెడికల్‌ డైరక్టరా? డాక్టరా? శాస్త్రవేత్తలు, డాక్టర్లు, టీకాలు కదా మనల్ని కాపాడింది’ అని గడలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

తాజా వివాదంతో ఉక్కిరిబిక్కిరవుతున్న గడల శ్రీనివాస్‌, తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు. తన ప్రసంగంలోని కొన్ని భాగాలు కట్‌ చేసి వివాదం సృష్టిస్తున్నారని చెప్పారు. తాను ఏ మతాన్ని ఎవరి నమ్మకాన్ని కించపరచనని స్పష్టం చేశారు. సర్వమతసారం ఒక్కటే నని సెలవిచ్చారు. అయితే గడల వివరణ ఇచ్చిన తర్వాతనే.. కరోనా సమయంలో ఆయన అవినీతిని బయటపెడామని, బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చెప్పడం గమనార్హం.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్