భార్య సుపారీ ఇచ్చి భర్తపై అటాక్ చేయించిన ఘటన మీకు గుర్తుంది కదా. ఫిబ్రవరి 20వ తేదీన జరిగిన అటాక్‌లో తీవ్రంగా గాయపడి.. మృత్యువుతో పోరాడిన డాక్టర్ చివరికి ఓడిపోయాడు.
వరంగల్‌లో యువ వైద్యుడు సుమంత్‌రెడ్డి మృతి చెందాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. 8 రోజులు ఆయన మృత్యువుతో పోరాడారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తన ప్రియుడితో హత్య చేయించింది భార్య ఫ్లోరా మరియా. ఈనెల 20న బట్టుపల్లి బైపాస్ రోడ్డులో సుమంత్‌పై దాడి చేశాడు శామ్యూల్ . ఇందుకు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ సహకరించాడు. ఈ కేసులో రెండు రోజుల కిందట మరియా, శామ్యూల్, రాజ్‌కుమార్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేడు ఖాజీపేటలో సుమంత్‌రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి.
ఈనెల 20న సుమంత్‌రెడ్డిపై దాడి జరిగింది. అప్పటి నుంచి ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం తెల్లవారుజామున మృత్యువుతో పోరాడుతూ ఆయన ఓడిపోయారు.
ఘటనకు సంబంధించిన వివరాలు..
డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్ నిర్వహిస్తుండగా.. ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేసేది. క్లినిక్ కి ముందు సుమంత్ ఓ ఆస్పత్రిలో పనిచేసేవాడు. ఆ సమయంలో ఫ్లోరా మరియా జిమ్‌కు వెళ్లేది. అప్పుడు శామ్యూల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం తెలిసిన సుమంత్ రెడ్డి భార్యను మందలించాడు. అయినా ఆమె భర్తను కాదనుకుంది.. ప్రియుడే కావాలనుకుంది. ఎలాగైనా సుమంత్ రెడ్డి అడ్డుతొలగించుకోవాలనుకుంది. ప్రియుడు శామ్యూల్, అతని స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్‌కు తన భర్తను హత్య చేయాలని సుపారీ ఇచ్చింది.
ఈనెల 20 రాత్రి ఖాజీపేట నుంచి బట్టుపల్లి బైపాస్ రహదారిపై కారులో వస్తున్న సుమంత్ రెడ్డిని అడ్డగించి.. రాడ్లతో దాడి చేసి చివరకు చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న సుమంత్‌రెడ్డిని పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ కేసులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు శామ్యూల్, స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులుగా తేల్చారు.