తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష్మీనృసింహుడి క్షేత్రాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఏటేటా నిర్వహించినట్లు కాకుండా ఈసారి స్వర్ణ విమాన గోపురం కలిగి కొత్త అనుభూతితో ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఇవాళ స్వస్తివచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 7వ తేదీ స్వామిఅమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, 8వ తేదీ తిరు కల్యాణమహోత్సవం, 9వ తేదీ దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 11న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 వరకు స్వామివారి నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహణ ఉండదని ఆలయ అధికారులు తెలిపారు.
ఇక స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల చెల్లించి టికెట్ తీసుకొని సాంప్రదాయ దుస్తులతో భక్తులు పాల్గొనాలని దేవస్థాన అధికారులు సూచించారు. ఎండలు దంచికొడుతుంటడంతో కొండ బండ నుంచి ఉపశమనం పొందేందుకు తిరువీధుల్లో పూర్తిగా తెలుపు రంగు వేశారు. దేవదేవుడి బ్రహోత్సవాలకు వచ్చే భక్తజనుల కోసం ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు నిర్వహించనున్నారు.