బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. సీబీఐ కార్యాలయంలో కవితను కలిసేం దుకు ఆయన హస్తినకు పయనమయ్యారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపే కవితను బయటకు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా బీఆర్‌ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ ఆమెను విచారిస్తోంది ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను, తన న్యాయవాదిని కలుసుకునే వెసు లుబాటును కవితకు కోర్టు కల్పించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, న్యాయవాది మోహిత్‌కు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ క్రమంలో శనివారం కవితను ఆమె భర్త అనిల్‌తోపాటు లాయర్లు శరత్, మోహిత్ రావు కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో కవితను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. న్యాయవాదులను కలిసి ఆయన మాట్లాడనున్నారు.
రేపటితో కవిత సీబీఐ కస్టడీ ముగియనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరుపర్చనన్నారు సీబీఐ అధికారులు. గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీ కాకుండా మరిన్ని రోజులు ఆమెను విచారించేందుకు కస్టడీ పొడిగించాలని లేదా జ్యుడీషియల్ రిమాండ్ కు పంపాలని కోర్టును సీబీఐ అధికారులు కోరనున్నట్లు సమాచారం. మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగిం చింది కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం మూడు రోజులు విచారణకు కోరడం సంచలనంగా మారింది.


