ఎన్నికల ఫలితాల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ టూర్ ఆసక్తికరంగా మారింది. చివరి విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో నేడు రాత్రికి ప్రత్యేక విమానంలో అమిత్ షా ఏపీకి రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోని అదే రోజు మధ్యాహ్నం తిరిగి రాజ్కోట్ వెళ్లనున్నట్లు చెప్పారు. అయితే అమిత్ షా పర్యటనలో చంద్రబాబు, పవన్ ఆయనతో భేటీ అవుతారా లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల పోలింగ్ తర్వాత అమిత్ షా తొలిసారిగా ఏపీకి వస్తుండటంతో.. చంద్రబాబు, పవన్ పోలింగ్ సరళి మీద ఆయనతో ఏమైనా చర్చిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఎన్డీయే కూటమి వైపు నుంచి క్లారిటీ లేదు. అమిత్ షా కేవలం శ్రీవారి దర్శనానికి మాత్రమే వస్తున్నారా.. ఈ పర్యటనలో రాజకీయ నేతలను కలిసి, ఏపీ రాజకీయాలపై చర్చిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రేపు చంద్రబాబు, పవన్ భేటీకానున్నారు. ఈ భేటీలో పోలింగ్ సరళిపైనా, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించనున్నట్లు సమాచారం.


