నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల రిలీజ్ ప్లాన్ మారబోతుంది అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. ఇంతకీ.. బాలయ్య ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు..? కాలికి సర్జరీ జరిగిందా..? లేదా..? నెక్ట్స్ సినిమాల ప్లాన్ ఏంటి..?
నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న మూవీ క్రిస్మస్ టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు షూటింగ్ జరుపుకుంటుంది. అందులో భాగంగానే కాకినాడ పోర్ట్ లో బాలకృష్ణ స్టంట్ చేస్తున్న సమయంలో సడన్ గా కాలుజారి కింద పడిపోయారట. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆయనను సమీపంలోని హాస్పిటల్ కి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కాలికి చిన్న ఎముక విరిగిందని, ఆయన త్వరగా కోలుకోవాలి అంటే సర్జరీ అవసరమని తెలిపారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే జూనీయర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. బాల బాబాయ్ త్వరగా కోలుకోవాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బాలకృష్ణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో మోకాలికి ఆపరేషన్ చేశారని సమాచారం. అయితే.. బాలయ్య పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నుంచి ఐదు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ తన సినిమా షూటింగ్‌లతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా కొంతకాలం విరామం ఇవ్వనున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్ చేసుంటే.. బాలయ్య సినిమా క్రిస్మస్ కు థియేటర్లోకి వచ్చేది. ఇప్పుడు 5 వారాలు బాలయ్య రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ మారింది.
సంక్రాంతికి వచ్చేందుకు ఇప్పటికే భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. అందుచేత సంక్రాంతికి కూడా ఈ సినిమా రాకపోవచ్చు. అదే జరిగితే.. సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. ఆగష్టు నుంచి కొరటాల మూవీని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యం కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మైత్రీ బ్యానర్లో వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అది కూడా లేట్ కానుంది. ఇలా బాలయ్య నెక్ట్స్ సినిమాల ప్లానింగ్ మారబోతుంది. పూర్తిగా క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే..


