నేచురల్ స్టార్ నాని నటిస్తున్న క్రేజీ మూవీ ప్యారడైజ్. మార్చిలో రావాల్సిన ఈ క్రేజీ మూవీ ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఈ భారీ చిత్రం గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు కానీ.. థియేట్రికల్ రైట్స్ ను భారీ రేటుకు దక్కించుకున్నారనే న్యూస్ వైరల్ అయ్యింది. 110 కోట్లుకు ప్యారడైజ్ రైట్స్ సొంతం చేసుకున్నారని దిల్ రాజు పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి.. వైరలైన వార్త వెనకున్న వాస్తవం ఏంటి..? అసలు ప్యారడైజ్ ఎప్పుడు థియేటర్స్ లోకి రాబోతుంది..?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్యారడైస్ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఏడాదికిపైగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు దిల్ రాజు భారీ ఆఫర్ ఇచ్చారని.. 110 కోట్లకు ఆయన రైట్స్ దక్కించుకున్నారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఈ వార్త నిజమా..? లేక గాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది.
ఈ క్రేజీ మూవీ రైట్స్ గురించి జరుగుతున్న వార్తలను ప్యారడైజ్ మూవీ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఖండించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అభిమానులు మరియు సినీ వర్గాలు ధృవీకరించని వార్తలను నమ్మవద్దని కోరింది. ఈ మూవీ పంపిణీ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న పుకార్లను దయచేసి నమ్మవద్దు. ఏదైనా అధికారిక సమాచారం ఉంటే, మా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే తెలియజేస్తాం అని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలియచేశారు. ప్యారడైస్ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతుండడం విశేషం.
ఈ భారీ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట ఆయా షేర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా పై నాని చాలా నమ్మకం పెట్టుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా సినిమాతో నాని 100 కోట్ల క్లబ్లో చేరారు. ఈ మూవీ అంతకు మించి ఉంటుందని ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ మూవీ ఎప్పుడు రిలీజ్ కానుందంటే.. సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


