మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. అయితే.. క్రిష్ ఈసారి ఓ ప్రయోగం చేయబోతున్నాడని.. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. క్రిష్ చేస్తున్న ప్రయోగం ఏంటి..?
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.. గమ్యం, వేదం, కృష్ణమ్ వందే జగద్గురుమ్, గబ్బర్ ఈజ్ బ్యాక్, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మణికర్ణిక, కొండపొలం, హరి హర వీరమల్లు, ఘాటి.. ఇలా వైవిధ్యమైన కథా చిత్రాలు తెరకెక్కించారు. అయితే.. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి కానీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మూవీని క్రిష్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఇప్పుడు క్రిష్ సైలెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. స్టార్ హీరోలతో సినిమాలు తీసే క్రిష్ ఈసారి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అందరూ కొత్త వాళ్లతో ఒక యూత్‌ఫుల్ రోడ్ డ్రామా తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో శరవేగంగా షూటింగ్ జరుగుతుందని.. త్వరలోనే ఈ సినిమా అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని క్రిష్ సొంత బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లోనే నిర్మిస్తున్నారు. ఇక సినిమా మొత్తం పూర్తయ్యాక ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌తో ఒకేసారి సర్ప్రైజ్ ఇవ్వాలనేది క్రిష్ ప్లాన్ అని తెలిసింది. ప్రస్తుతం ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటుందని తెలిసింది. ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. కొత్తవాళ్లతో క్రిష్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.


