ఏపీలో కూటమి రెండేళ్ల పాలనలో విద్యుత్ సంస్కరణలపై మంత్రి గొట్టిపాటి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన ఓ సమర్థవంతమైన నాయకుడు తన విజన్ తో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేసింది చూసాం. ఒక అసమర్థ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడిపిస్తే.. ఆ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం నాశనం అవుతుందో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో చేసి చూపించాడు. జగన్ మోహన్ రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాలను బయట పెట్టేందుకు విద్యుత్ శాఖలో 2019-24 కాలం బెస్ట్ కేస్ స్టడీ గా నిలుస్తుంది. జగన్ ఐదేళ్ల హయంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సుమారు రూ.32వేల కోట్లు భారం ప్రజలపై వేశారు. దీనికి ప్రధాన కారణం బహిరంగ మార్కెట్ లో యూనిట్ విద్యుత్ ధర రూ. 12 – 15 లకు కొనుగోలు చేయడమే. ఇవే కాకుండా జగన్ రెడ్డి ఐదేళ్లలో విద్యుత్ సంస్థలపై రూ. 49,596 కోట్లు అప్పులు చేశారు. విద్యుత్ సంస్థల అప్పులు రూ.72,826 కోట్ల నుంచి రూ.1,12,422 కోట్లకు భారీగా పెరిగాయి. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాలనా నిర్లక్ష్యం కారణంగా…VTPSలో 800 మెగావాట్ల యూనిట్ 55 నెలలు ఆలస్యం అయ్యింది. దీంతో విద్యుత్ రంగంపై అదనంగా రూ.7,000 కోట్లు భారం పడింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ 44 నెలలు ఆలస్యం అయ్యింది. దీంతో విద్యుత్ రంగంపై అదనంగా రూ.5,900 కోట్లు భారం పడింది. వీటీపీఎస్, కృష్ణపట్నం ప్రాజెక్టుల వల్ల మొత్తం నష్టం: రూ.13 వేల కోట్లకు పై మాటే. పోలవరం జల విద్యుత్ కేంద్రం 2023 నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ఆడిన కమీషన్ నాటకాలతో విద్యుత్ శాఖ రూ.4,737 కోట్ల ఆదాయాన్ని నష్టపోయింది.
ఈ విధంగా మొత్తం విద్యుత్ రంగానికి జగన్ రెడ్డి చేసిన నికర నష్టం అక్షరాలా రూ.1.29 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. చంద్రబాబు నాయుడు విజన్ కారణంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. 2014లో కేవలం 1,342 మెగావాట్లుగా ఉన్న Green Energy సామర్థ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో 7,716 మెగావాట్లకు చేరింది. నాడు ఇది దేశంలోనే టాప్. గ్రీన్ ఎనర్జీలో చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనే అక్కసుతో… అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రెడ్డి దేశ, విదేశీ పెట్టుబడుదారులను భయబ్రాంతులకు గురి చేశాడు. విద్యుత్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు చేసుకున్న PPA (Power Purchase Agreement) జగన్ రద్దు చేశాడు.
Solar, Wind Energy రంగాల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తల నుంచి విద్యుత్ కొనుగోలు చేయలేదు. దీంతో విదేశీ పెట్టుబడిదారులు ఆయా దేశాధ్యక్షులతో మన ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఇలా ఏపీ ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేసిన ఘనడు జగన్. ఇలా గ్రీన్ ఎనర్జీలో ప్రపంచ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న మంచి పేరును జగన్ మోహన్ రెడ్డి తన తుగ్లక్ చేష్టలతో చెడగొట్టారు.
దీంతో ఐదేళ్లలో ఈ రంగంలో పెట్టుబడులు రాలేదు. యువతకు ఉపాధి కల్పన కూడా కలగా మిగిలింది. ఈ చర్యల కారణంగా ఏపీ ప్రగతి సుమారు 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున TAX లను కోల్పోయింది. రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఇదే కాకుండా… జగన్ చేసిన తప్పుకు హిందూజా ప్రాజెక్టుకు Fixed cost రూపంలో ఉపయోగించుకోని విద్యుత్ కు కూడా రూ.1,235 కోట్లు విద్యుత్ శాఖ అనవసరంగా చెల్లించాల్సి వచ్చింది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ జెన్కో ను సర్వనాశనం చేసింది. జెన్కో లో బొగ్గు లేకుండా చేసి జెన్కోను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కావాల్సిన విద్యుత్ ను బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారు. 2019లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత CRDA లో విద్యుత్ శాఖకు సంబంధించిన పనులను ఆపేశారు. తిరిగి ఆ పనులు చేపట్టేందుకు అదనంగా రూ.281 కోట్ల ఖర్చు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే డిస్కమ్‌లకు ‘ఎ’ రేటింగ్ వస్తుంది. జగన్ ప్రభుత్వంలో డిస్కంలు ‘సీ’ , ‘డీ’ రేటింగులకు పడిపోయాయి. రేటింగ్ తగ్గడంతో వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో ఐదేళ్లలో రూ.2,500 కోట్ల భారం పడింది. జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ సంస్థలోని డబ్బులు కూడా బేవరేజ్ కార్పొరేషన్ కు మళ్లించారు. వ్యవస్థలను, వ్యాపారస్థులను, ప్రజలను మోసం చేసిన జగన్ రెడ్డి… చివరకు విద్యుత్ శాఖ ఉద్యోగులను కూడా మోసం చేశాడు. ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ కూడా వారికి తెలియకుండా దారి మళ్లించాడు.
జీతాలు రాక ఉద్యోగులు రోడ్లు ఎక్కే పరిస్థితికి విద్యుత్ శాఖను తీసుకొచ్చిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి. జగన్ రెడ్డి ఆక్వా రైతులకు అన్యాయం చేశారు. పాదయాత్రలో యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చి, ఆక్వా జోన్, నాన్-జోన్ పేర్లతో రైతులను విడదీసి కొంత మందికి సబ్సిడీ దూరం చేశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్ లేక, కోతలతో రైతులు జనరేటర్లపై ఆధారపడి ఎకరానికి రూ.70 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించలేకపోయాడు. దీంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయారు. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల భవిష్యత్తు తరాల వారికి ఉద్యోగ అవకాశాలు పోయాయి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలపై నమ్మకం సన్నగిల్లింది. 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ అప్పుతో… (రూ. 4 వేల కోట్లు) విద్యుత్ శాఖను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెడితే… జగన్ రెడ్డి మాత్రం రూ.50 వేల కోట్లు అప్పులు చేసి విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసి దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు.” అని గొట్టిపాటి రవి అన్నారు


