బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ రామాయణ. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ రాముడుగా నటిస్తుంటే.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి సీతగా నటిస్తుంది. కేజీఎఫ్ హీరో యశ్ రావణుడుగా నటిస్తున్నారు. ఆమధ్య ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తే.. క్వాలిటీ సరిగా లేదని విమర్శలు వచ్చాయి. టీజర్ క్వాలిటీ పై వచ్చిన విమర్శలను స్వీకరించిన రామాయణ మేకర్స్.. మరింత క్వాలీటీతో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే.. రామాయణ మేకర్స్ పెద్ద తప్పు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ.. ఈ క్రేజీ మూవీ మేకర్స్ చేసిన తప్పు ఏంటి..?
సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి రామాయణ. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 24న రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడానికంటే వారం రోజుల ముందే చిత్ర బృందం మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇలా వన్ వీక్ ముందే మీడియా ప్రతినిధులకు స్పెషల్ చూపించడమే ఈ మూవీ మేకర్స్ చేసిన అతి పెద్ద తప్పు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కారణం ఏంటంటే.. ట్రైలర్‌కు సంబంధించిన నాసిరకం వీడియో క్లిప్‌లు, స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేటి డిజిటల్ యుగంలో ఇలాంటి ముందస్తు ప్రదర్శనలు ప్రమాదకరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం, అలాగే ఏఐ ద్వారా అపోహలు సృష్టించే అవకాశం ఉన్న ఈ కాలంలో, ట్రైలర్‌ను కొన్ని రోజుల పాటు గోప్యంగా ఉంచడం అసాధ్యమని, ఇది నిర్మాతలు చేసిన అతి పెద్ద తప్పిదమని కామెంట్లు రావడం చర్చనీయాంశం అయ్యింది. మీడియాకు చూపించిన రోజునే ట్రైలర్‌ను భారీ ఈవెంట్ ద్వారా అఫీషియల్ గా రిలీజ్ చేయకుండా ఎందుకు ఇలా చేశారని సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయి. ప్రస్తుతం లీకైన వీడియోలు స్పష్టంగా లేకపోవడం, అసంపూర్ణంగా ఉండటంతో సినిమాపై ప్రతికూల ప్రచారం ఏర్పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలు ట్రైలర్ ఎలా ఉందంటే.. రావణుడి ఎంట్రీతో ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని… రావణుడి పాత్రలో యశ్ కట్టిపడేశాడని… సీత పాత్రలో సాయి పల్లవి హుందాతనం, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయని టాక్ వచ్చింది. 3డీ కోసం రూపొందించిన విజువల్ షాట్లు కూడా థియేటర్లలో కొత్త అనుభూతిని అందించనున్నాయి అంటున్నారు. అయితే.. అధికారిక ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహం నెలకొనే అవకాశం ఉన్నప్పటికీ, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లీక్ కావడం.. అందులో క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ మేకర్స్ ఒకలా ఆలోచించి చేస్తే.. దాని రిజెల్ట్ వేరేలా వస్తుంది. దీంతో.. సినిమా ఎలా ఉండబోతుంది..? ఎలాంటి రిజెల్ట్ రానుంది..? అనేది ఆసక్తిగా మారింది. చూడాల మరి.. రామాయణ బాక్సాఫీస్ దగ్గర ఎంత వరుకు మెప్పిస్తుందో..?


