సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత మీర్జాపురం కృష్ణవేణి ఇక లేరు. ఆదివారం ఉదయం ఆమె తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానం. లేత వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు.
కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. 1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీర్జాపురం రాజా, మేక రంగయ్య నిర్మించారు. వీరికి మేక రాజ్యలక్మి అనురాధ జన్మించారు. అనురాధ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుది స్వాస విడిచినట్లు అనురాధ తెలిపారు.
2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు … కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. ఇటీవలే ఎన్.టి.ఆర్. వజ్రోత్సవం సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , కృష్ణవేణిని సత్కరించారు.