సినిమా నిర్మాతలకు చురకలంటించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. బందిపోటు, స్మగ్లర్ల సినిమాలు తీసి యువతను చెడగొడుతున్నారని ఒక విధంగా సినీ పరిశ్రమపై అటాక్ చేశారాయన. పిచ్చిపిచ్చి సినిమాలు తీయొద్దని చెప్పకనే చెప్పారు.
సమాజానికి ఉపయోగపడేలాగా ఆదర్శవంతంగా సినిమాలు తీయాల్సి పోయి, బందిపోట్లు స్మగ్లర్ల బయోగ్రఫీలను తెరకెక్కించడంతో యువతకు ఏం సందేశం ఇస్తున్నారని సినీ నిర్మాతలను మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పొలం దేవి వీరప్పన్ లాంటి వారి బయోగ్రఫీలతో సినిమాలు చేసి యువతను చెడుదోవ పట్టించే విధంగా తయారు చేస్తున్నారన్నారు.
సత్యకుమార్ శనివారం నంద్యాల్లో ఓ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాల ద్వారా చిన్నతనంలోనే విద్యార్థులను స్మగ్లర్లుగా మారాలని సందేశం ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు. పుట్టిన ఊరికి, సమాజానికి మేలు చేసే వారి జీవిత విశేషాలతో సినిమాలను తీయాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయడం వల్ల మరికొందరు ముందుకొచ్చి సహాయం చేస్తే సమాజం బాగుపడుతుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.
సత్యకుమార్ మాటలను చూస్తే గతంలో ఇలాంటి వ్యాఖ్యలే ఎవరో చేసినట్టుగా ఉంది కదా. అవును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాట్లాడుతూ… సినిమాలో హీరోనే స్మగ్లర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు డైరెక్టుగా మెగా కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ కు తగిలాయి. ఎందుకంటే పుష్పలో హీరోగా చేసిన అల్లు అర్జున్ .. అందులో రెడ్ శాండిల్ స్మగ్లర్ కాబట్టి. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గొడవల కారణంగానే పవన్ కళ్యాణ్ ఇలా అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి మాట్లాడారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు సత్యకుమార్ మాట్లాడిన మాటలు కూడా పుష్ప హీరోకి వర్తిస్తాయా మరి..!