ఎందుకింత నిర్లక్ష్యం.. ప్రాణాలంటే లెక్కలేదా..?
రైల్వే అధికారుల నిర్లక్ష్యం 18 మంది ప్రాణాలను బలితీసుకుంది. సరైన సమాచారం లేక మహాకుంభమేళాకు వెళ్లాల్సిన భక్తులు.. రైలు కోసం పరుగులు పెట్టారు. దీంతో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఎలా జరిగింది..?
కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు ఢిల్లీ రైల్వే స్టేషన్ కి పోటెత్తారు. రైళ్లు ఆలస్యమవుతున్నాయని.. రద్దు వదంతులతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. 14, 15 ప్లాట్ ఫామ్ లపై ఈ ఘటన జరిగింది. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ నిలిచి ఉండడంతో 14వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్, భవనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ఆలస్యం అయ్యాయి. దీంతో వాటి కోసం 12, 13, 14 ప్లాట్ ఫామ్ లపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్యపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
రైల్వే శాఖ నష్టపరిహారం
ఇక రైల్వే శాఖ అధికారులు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. లక్ష ఇస్తామని చెప్పారు. మృతుల్లో బిహార్ కు చెందిన 9 మంది ఉన్నారు. ఢిల్లీకి చెందిన 8 మంది, హర్యానాకు చెందిన ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అదనపు భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. తొక్కిసలాట ఘటనలపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.
రైల్వే, ఢిల్లీ పోలీసుల విరుద్ధ ప్రకటనలు
ఘటనపై ఉత్తర రైల్వే సీపీఆర్ ఓ హిమాన్షు ఉపాధ్యాయ్ ప్రకటన విడుదల చేశారు. కొందరు ప్రయాణికులు 14, 15 ప్లాట్ ఫామ్ మధ్య ఉన్న మెట్లపై నుంచి జారిపడ్డారని వివరించారు. వారి వెనుక నిలబడి ఉన్న వారు కిందపడ్డారని చెప్పారు. ఆయన ప్రకటనకు విరుద్ధంగా ఢిల్లీ పోలీసులు వాదిస్తున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. గంటకు 1500 జనరల్ టికెట్లు ఇచ్చామని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే జనం నిలబడేందుకు ప్లాట్ ఫామ్ లపై చోటు లేదని పోలీసులు ఎఫ్ ఐ ఆర్ లో నివేదించారు.
రైల్వే నిర్లక్ష్యానికి కుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపతి సంతాపం..
రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే సిస్టం సరిగ్గా లేకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారు. తొక్కిసలాట ఘటనను సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత మీద ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.