పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu )అన్నారు. సమాజంలో మార్పు వస్తేనే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తలసరి ఆదాయం పెంచడమే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. “సంపద సృష్టించి పేదలకు పంచాలి. ఆర్థిక అసమానతలు తగ్గాలి. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు సమర్థంగా పనిచేయాలి” అని అన్నారు.
జనాభా పెరుగుదలపై గతంలో కుటుంబ నియంత్రణ అవసరమని చెప్పామని, కానీ ఇప్పుడు పిల్లలే సంపదగా భావించాలని సమాజానికి సందేశం ఇస్తున్నామని పేర్కొన్నారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు అందిస్తామని తెలిపారు. “పిల్లలు భారమనే భావన పోవాలి.. వాళ్లే భవిష్యత్తు సంపద” అని అన్నారు.
అలాగే తల్లికి వందనం పథకం కింద ప్రస్తుతం రూ.15 వేలు అందిస్తున్నామని, భవిష్యత్తులో ఆ మొత్తాన్ని మరింత పెంచే ఆలోచన ఉందని చెప్పారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూవివాదాలు, అక్రమాలు పెరిగాయని ఆరోపించిన చంద్రబాబు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూముల రక్షణకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. భూ తగాదాలు లేకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. “అలవాట్లు మారితే సమాజం మారుతుంది. చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని, కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజూ క్లీన్ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రానికి గత 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ ఒప్పందాల ద్వారా యువతకు 24 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విశాఖపట్నానికి గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చామని పేర్కొంటూ, “ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు.. పరిశ్రమల కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికే వలసలు రావాలి” అని అన్నారు.


