కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. ధనుష్ బాలీవుడ్లో చేసే భారీ చిత్రం ఎలా ఉండబోతుంది..? ఈ క్రేజీ మూవీకి డైరెక్టర్ ఎవరు..? ప్రొడ్యూసర్ ఎవరు..?
కోలీవుడ్ స్టార్ ధనుష్ మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన ఓ ప్రతిష్టాత్మక మైథలాజికల్ చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఈ భారీ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించనున్నట్లు సమాచారం. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు సామాజిక, యాక్షన్ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించిన పీఎస్ మిత్రన్, తొలిసారి మైథలాజికల్ జానర్‌లో సినిమా చేస్తుండడం.. అది కూడా బాలీవుడ్లో మూవీ చేస్తుండడం ఆసక్తిగా మారింది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ధనుష్, కరీనా కపూర్‌ల కాంబినేషన్‌లో సినిమా రానుండటం అనేది హాట్ టాపిక్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక బృందం, చిత్ర ప్రారంభం వంటి పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ విషయంలో సంజయ్ లీలా భన్సాలీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, పలుమార్లు మార్పులు చేసి కథను ఫైనల్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ మూవీ చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాత ధనుష్–పీ.ఎస్. మిత్రన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 2027 ప్రారంభంలో సెట్స్ పైకి రానుంది. ధనుష్, కరీనా కపూర్ కాంబినేషన్ నిజమైతే.. ఈ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనే అవకాశముంది. మొత్తానికి ధనుష్ పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.. ప్లాన్ అదిరిందని ప్రచారం జరుగుతుంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ మూవీలో కరీనా కపూర్ నే తీసుకుంటారో.. లేక వేరే హీరోయిన్ ని ఫైనల్ చేస్తారో అనేది తెలియాల్సివుంది.


