టెలివిజన్ నటి సంచిత ఉగాలే(22).. ఆత్మహత్య చేసుకున్నారు. కుంకుమ భాగ్య, వాగ్లేకి దునియా వంటి సీరియల్స్ ద్వారా సంచిత ఉగాలే గుర్తింపు పొందారు. జూన్ 14న ముంబైలోని నలాసోపారా ఈస్ట్‌లో ఆచోళే గ్రామంలో ఉన్న సాయి సంతోషి భవనంలోని ఆమె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆచోళే పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినోద్ బాఘ్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల మధ్య సంచిత తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుని, చీర సహాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను వసాయి-విరార్ మున్సిపల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఆమె ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేశారు. అనంతరం పంచనామా నివేదికను సిద్ధం చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపించారు.
టెలివిజన్, ఫిల్మ్స్, ఓటీటీలో పలు ప్రాజెక్టుల్లో సంచిత పనిచేశారు. కుంకుమ భాగ్యలో దియా టాండన్ రోల్‌లో నటించి మెప్పించారు. వాగ్లేకి దునియాలో రుచితా జైట్లీగా కూడా నటించి అభిమానులకు చేరువయ్యారు. సంచిత పలు సినిమాల్లో నటించారు. అలాగే డిజిటల్ ప్రాజెక్టుల్లోనూ ఆమె పనిచేశారు. విక్కీ కౌశల్ నటించి చావాలో తారా రాణి చిన్ననాటి పాత్రలో సంచిత నటించారు.


