గులాబీ పార్టీలో ఆ నేతకు ప్రయారిటీ రోజురోజుకు పెరుగుతోందా…? అధిష్టానం సైతం ఆ లీడర్ కు ప్రాధాన్యత ఇస్తోందా…? మాజీ పోలీస్ ఉన్నతాధికారి కావడమే కారణమా…? ముఖ్యమైన అంశాలపైనా ఆ లీడర్ రియాక్ట్ అవుతున్నారా…? ఆ నేతకు గులాబీ అధిష్టానం అంతగా ప్రయారిటీ ఇవ్వడంతో పార్టీలోని కొంత మంది నేతలు జీర్ణించుకోలేక పోతున్నారా…? ఇంతకు దీనిపై బిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఏం
చర్చ జరుగుతోంది…?
బిఆర్ఎస్ పార్టీలో మాజీ ఐపీఎస్ అధికారి, ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు ప్రయారిటీ పెరుగుతోంది. ఇటీవల కాలంలో పలు ముఖ్యమైన అంశాలపైనా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందిస్తున్నారు. ఇక ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు అధిష్టానం ఎందుకు ప్రయారిటీ ఇస్తుందనేది గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మాజీ పోలీసు ఉన్నతాధికారి కావడంతో పాటు పలు అంశాలపై అర్ధం అయ్యేటట్లు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడతారు. దీంతో అధిష్టానం అందుకే ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు గురుకులాలకు సెక్రటరీగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఆ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయారు. బీఎస్పీలో ఉన్న సమయంలో బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటిఆర్ పైనా ఆరోపణలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించారు. కేసీఆర్ తో చర్చలు సైతం జరిపారు. కానీ మాయావతి ఒప్పుకోలేదు. దీంతో బిఆర్ఎస్ పార్టీలో చేరి నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి RSP ఓడిపోయారు.
RS ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరిన సమయంలోనే ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఇక పార్టీ ప్రతిపక్షం లోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే వివిధ స్కాములను ఆర్.ఎస్.పి బయటపెడుతున్నారు. ఇక తాజాగా బండి భగీరధ్ ఫోక్సో కేసుపై RS ప్రవీణ్ కుమార్ వరుస ప్రెస్ మీట్స్ పెట్టారు. ఈ అంశంలో గులాబీ పార్టీ తరపున RS ప్రవీణ్ కుమార్ ఒక్కరే మాట్లాడారు. ఈ అంశంలో బీజేపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఇరుకున పెట్టే విధంగా RS.ప్రవీణ్ కుమార్ తన చతురత ప్రదర్శించారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి అంశాలపై RSP స్పందిస్తున్నారు. బంకర్ బెడ్ కొనుగోళ్లు, గురుకుల స్కూల్ లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫారం, బ్యాగులు,ఇతర సామగ్రి కొనుగోళ్ల టెండర్ల అంశంలో అవినీతి జరిగిందని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురుకుల టెండర్లపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ సైతం విసిరారు. అంతే కాదు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వం అంతర్గత వ్యవహారాన్ని బహిర్గతం చేస్తుందని RSP తనదైన శైలిలో కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంలో కుట్రలు ఉన్నాయని RS ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేశారు. అయితే గులాబీ పార్టీలో RSPకి ప్రయారిటీ ఇవ్వడంపై కొంతమంది నేతలకు రుచించడంలేదట. మరోవైపు పార్టీలో RS ప్రవీణ్ కుమార్ కు ప్రయారిటీ ఇవ్వడంతోనే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ చేంజ్ అయ్యారనే టాక్ వినిపించింది. ఇక అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు అటు వ్యక్తిగతంగా ఇటు పార్టీ యాక్టివిటీస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తానికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు గులాబీ అధిష్టానం ఇప్పుడు ఇస్తున్న ప్రయారిటీ రాబోయే రోజుల్లోను కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.


