స్వతంత్ర, వెబ్ డెస్క్: పర్యావరణహితంలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి కెసిఅర్ నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇదని పేర్కొన్నారు. భవిష్యత్తుతరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసమే తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వ పచ్చదనం, పర్యావరణ కార్యక్రమాలలో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు.