స్వతంత్ర వెబ్ డెస్క్: విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారంటూ, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ హాజరయ్యారు. ఈ కేసులో సోమవారం అనిల్ అంబానీని కూడా ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. యస్ బ్యాంక్ లోన్ కిక్‌బ్యాక్స్ కేసుకు సంబంధించి 2020లోనూ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే, ఆయన ఏ కేసులో నిన్న ఈడీ ఎదుట హాజరయ్యారన్నది తెలియాల్సి ఉంది. రూ. 420 కోట్ల పన్ను ఎగవేత కేసులో అనిల్ అంబానీపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ గతేడాది సెప్టెంబరులో బాంబే హైకోర్టు ఆదేశించింది.
నిన్న ఈడీ ముందు హాజరైన అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. కాగా 2020లో మనీ లాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులతో పాటు అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారని సమాచారం.