స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి భాగ్యనగరానికి వచ్చారు. బెంగళూరు నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్, తదితరులు దేశ ప్రథమ పౌరురాలుకు స్వాగతం పలికారు.
హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పూలగుచ్ఛంతో ఆహ్వానించి, శాలువా కప్పి ప్రెసిడెంట్ ను సన్మానించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రెసిడెంట్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి పరిచయం చేశారు.
విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. భోజనం అనంతరం మధ్యాహ్నాం 3 గంటలకు ద్రౌపది ముర్ము హెలికాప్టర్ లో గచ్చిబౌలి స్టేడియానికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుంచి అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి హెలికాప్టర్ లో హరీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు భారత వాయుసేన విమానంలో నాగపూర్ కు బయలుదేరి వెళ్తారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి వస్తున్న సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి స్టేడియం వైపు వాహనాల మళ్లింపు ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులను పోలీసులు కోరారు.