అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్డులో తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని చెబుతుంటారు. కానీ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా.. ఒక మహిళ రోడ్డుపై నడవటం సంగతి అటు ఉంచితే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీలో తమ వాష్ రూమ్ లో కూడా విద్యార్థినుల మానానికి భద్రత లేకుండా పోయింది. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. మన ఆంధ్రప్రదేశ్‌లో అది కూడా అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఇలాకాలో విద్యార్థినుల మానానికి రక్షణ లేకుండా పోయింది.
బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థినుల వాష్ రూమ్ లో ఉండగా గుర్తుతెలియని అగంతకులు తొంగి చూస్తున్నారు. గతంలోనే ఈ విషయాన్ని అమ్మాయిలు గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులు దీనిపై చాలా నిర్లక్ష్యంగా వహించారు. ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే ఆదేశాలకు లెక్కలేదు.. విద్యార్థుల ఫిర్యాదును పట్టించుకున్న పాపాన పోలేదు. బుక్కరాయసముద్రం పోలీసులు నిద్రపోతున్నారో లేక నిద్ర నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
తాజాగా ఆదివారం రాత్రి కూడా గుర్తు తెలియని అగంతకులు వాష్ రూమ్‌లో తొంగి చూస్తుండటాన్ని విద్యార్థినులు గమనించారు. కేకలు వేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే విద్యార్థినిలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలకు రక్షణ లేకపోవడం ఏంటని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం పోలీసులపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక యూనివర్సిటీలో విద్యార్థినిలకు రక్షణ లేదని ఆందోళనలు జరుగుతున్నా..ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మంచి భవిష్యత్ కోసం ఊరిని, కుటుంబాలను, ఇంటిని వదిలి ఎక్కడో దూరంగా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు విద్యార్థినిలు. ఇంటి నుంచి కాలు బయట పెడితే తమ మాన, ప్రాణాలపై భరోసా లేకపోయినా ఉన్నత చదువుల కోసం రాక తప్పడం లేదు. ఇలా హాస్టల్స్‌లో ఉంటున్న అమ్మాయిలకు.,.. హాస్టల్స్ సిబ్బంది నుంచో, బయటి ఆకతాయిల నుంచో, ఆగంతకుల నుంచో సమస్యలు చుట్టుముడుతున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్టు ఊరుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కదిలి అమ్మాయిలకు భరోసా ఇవ్వాలని వేడుకుంటున్నారు.