సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనలు ఉత్తర భారతదేశం అంతటా సంభవించాయి. తెల్లవారుజామున 5.30 గంటలకు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో ఎప్పుడూ ఇంత బలమైన భూకంపాన్ని చూడలేదని ఢిల్లీ వాసులు అంటున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో నమోదైందని అధికారులు ప్రకటించారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం దాదాపు 5 కి.మీ. లోతులో సంభవించింది.
ధౌలా కాన్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజీ సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నోయిడా, ఘజియాబాద్ లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు.
మళ్లీ భూకంపం- మోదీ
భూకంపంపై స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆందోళన చెందొద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని రాజధాని వాసులకు సూచించారు. దీనిపై అధికారులు నిశితంగా గమనిస్తున్నారని.. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.
భవనాలు కంపించడాన్ని చూసి తాము భయాందోళనకు గురయ్యామని అక్కడి నివాసితులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ.. రైలు భూగర్భంలో నడుస్తున్నట్లు భావించానని చెప్పాడు.
భూకంప జోన్ IVలో ఢిల్లీ
భౌగోళిక పరిస్థితుల కారణంగా ఢిల్లీలో ఇటువంటి భూకంపాలు సాధారణం. గతంలో కూడా నగరం ఇలాంటి ప్రకంపనలతో అతలాకుతలమైంది. 2020లో, 3.0 తీవ్రత కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం మూడు భూకంపాలు దేశ రాజధానిని తాకాయి. అనంతరం డజను ప్రకంపనలు సంభవించాయి.
ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. ఢిల్లీ భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉన్న భూకంప జోన్ IVలో ఉంది. ఈ జోన్‌లో భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భూకంపాలు సాధారణంగా 5-6 తీవ్రతతో, అప్పుడప్పుడు 7-8 తీవ్రతతో కూడా సంభవిస్తాయి. అయితే, జోనింగ్ అనేది నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియ.
1720 నుండి, రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం ఐదు భూకంపాలు నగరాన్ని కుదిపేశాయని నివేదికలు చెబుతున్నాయి.
భూమి పొరల్లో .. సన్నని బయటి పొర .. టెక్టోనిక్ ప్లేట్లు అని పిలువబడే పెద్ద , ఘనమైన రాతి పలకలతో తయారయి ఉంటుంది. అలాంటి ఏడు పెద్ద , చిన్న ప్లేట్లు ఉంటాయి. ఈ ప్లేట్లు చాలా నెమ్మదిగా కదులుతూ.. భూకంపాలకు కారణమవుతాయి.
హిమాలయాలు సహా ఉత్తర భారతదేశంలో.. భారత టెక్టోనిక్ ప్లేట్.. యురేషియన్ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. ఈ ప్లేట్లు స్ప్రింగ్ లాగా శక్తిని నిల్వ చేస్తాయి, అవి ఒకదానిపై ఒకటి పడినప్పుడు శక్తిని విడుదల చేస్తాయి. ఫలితంగా భూకంపానికి దారితీస్తుంది.
భూకంపాల వల్ల ఢిల్లీ సురక్షితమైనది కాదా..?
ఢిల్లీ భూకంపం జోన్ IVలో ఉండడంతో.. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విశ్లేషణ ప్రకారం.. భూకంప నిరోధక భవనాలు ఎక్కువగా ఉండటం, అధిక జన సాంద్రత, ప్రణాళిక లేని అసురక్షిత నిర్మాణాలు, రద్దీగా ఉండే ప్రాంతాల కారణంగా దేశ రాజధానికి ముప్పు పొంచి ఉందని అంటున్నారు.
ఢిల్లీలో 6.5 శాతం ఇళ్లకు హై డ్యామేజ్ రిస్క్, 85 శాతం కంటే ఎక్కువ ఇళ్లకు మోడరేట్ డ్యామేజ్ రిస్క్ ఉందంట. ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని.. వివిధ రకాల భవన నిర్మాణాల తీరును తెలుసుకోవాలంటే మరింత అధ్యయనం అవసరమని చెబుతున్నారు.
దురదృష్టవశాత్తు .. ఢిల్లీలోని చాలా భవనాలు భూకంపాలను తట్టుకునే భారతీయ ప్రమాణలకు అనుగుణంగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో పెద్ద భూకంప విపత్తుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.