గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయిన నాటి నుంచి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్ పార్టీకి ఊరటగా మాజీ ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ పార్టీలో చేరారు. శైలజానాథ్‌తో పాటు అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్ వైసీపీలో చేరబోతున్న విషయాన్ని స్వతంత్ర ఛానెల్ డిసెంబర్‌లోనే వెల్లడించింది.
ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలో చేరానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని ఫైరయ్యారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్న శైలజానాథ్.. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు తన వంతు పనిచేస్తానని చెప్పారు. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదన్నారు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉందని.. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. తనకు జగన్ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని చెప్పారు.
రాజకీయాల్లో శైలజానాథ్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు వైసీపీకి, జగన్‌కు చాలా అవసరం కూడా. ఆయన వైసీపీలో చేరడంతో పార్టీకి మంచి అనుభవం ఉన్న నేత దొరికినట్టైంది. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్… శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.