హీట్ పుట్టిస్తున్న తీన్మార్ మల్లన్న వ్యవహారం
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్న మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మల్లన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను మలన్న కాల్చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ.. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. షోకాస్ నోటీసులపై మల్లన్న ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయ OC ఆధిపత్యం కారణంగా తెలంగాణలో కుల గణన లోపభూయిష్టంగా ఉందని అన్నారు. నిజమైన సామాజిక న్యాయం కోసం న్యాయమైన, పారదర్శక సర్వే అవసరం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు.
బీసీలకు 42 శాతం సీట్లు- మంత్రి పొన్నం
బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సర్వేలో ప్రజలు ఇష్టపూర్వకంగా సమాచారం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొనరని.. అవహేళన మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు. సర్వేలో పాల్గొన్న వాళ్లకే కులగణనపై మాట్లాడే అవకాశం ఉందని చెప్పారు. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు.
అరెస్ట్ వారెంట్‌పై సోనూసూద్
తన అరెస్ట్ వారెంట్‌పై ప్రముఖ నటుడు సోనుసూద్ స్పందించారు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరమని ఆయన అన్నారు. కాగా మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్‌లోని లుథియానా కోర్టు నటుడు సోనుసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముంబైలోని అంథేరీ వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్‌స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విచారణకు హాజరైన రామ్‌గోపాల్ వర్మ
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు ఆయన్ను విచారిస్తున్నారు. అంతకుముందు ఆర్జీవీని YCP నేత చెవిరెడ్డి భాస్కర్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విచారణ కోసం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిసారు. మద్దిపాడు మండలం బెల్లంపల్లి సమీపంలోని ఆవాస్ గెస్ట్ హౌస్ వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కలిశారు.ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మతో బూచేపల్లి, చెవిరెడ్డి చర్చలు జరిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్
అక్రమ హోర్డింగ్స్‌పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 140కి పైగా అక్రమ హోర్డింగ్‌లను హైడ్రా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి వాటిని తొలగించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బెంగుళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి ఇరువైపులా అక్రమంగా హోర్డింగ్స్ వెలిశాయి. మున్సిపల్ సిబ్బంది ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 అక్రమ హోర్డింగ్‌లు భారీ పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు.
కడప జైలులో దస్తగిరి విచారణ
కడప జైల్లో దస్తగిరి విచారణకు హాజరయ్యాడు. వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని ఇబ్బంది పెట్టిన ఘటనపై కడప జైల్లో విచారణ కొనసాగుతోంది. పోలీస్ ప్రత్యేక అధికారి రాహూల్ శ్రీరామ ఎదుట విచారణకు హాజరయ్యాడు. 2023 నవంబర్‌లో తనకు ఎదురైన బెదిరింపులు, ప్రలోభాలపై విచారణ అధికారికి వివరిస్తున్నాడు. కడప సెంట్రల్ జైల్లో దేవిరెడ్డి చైతన్య రెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశాడు. రేపు సీఐ ఈశ్వరయ్య, డీఎస్పీ నాగరాజులను విచారించే అవకాశం ఉంది.
ఏసీబీ అధికారుల దాడులు
హనుమకొండ జిల్లా ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. హనుమకొండ డిటిసిగా పని చేస్తున్న పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు. పక్క సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
భార్యపై భర్త హత్యాయత్నం
హైదరాబాద్ చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆర్ కె పురంలో నివాసం ఉంటున్న వెంకటేష్, సునీత అనే భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య తలను గోడకు కొట్టి హత్యాయత్నం చేశాడు. ఘటన అనంతరం భార్య చనిపోయిందని భావించిన వెంకటేష్.. ఎల్ బీ నగర్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే, వెంటనే స్పందించిన పోలీసులు… ఘటన స్థలికి చేరుకుని, తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సునీత ను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సునీత పై అనుమానం తోనే హత్యాయత్నం చేసినట్లు భర్త వెంకటేష్ పోలీసులకు తెలిపాడు.
కల్లులో ఎలుక
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో కల్లులో ఎలుక రావడం కలకలం రేపింది. గుడ్ల సర్వలోని కల్లు దుకాణంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కల్లు దుకాణంలో ఒక ట్రే కల్లు కొని తీసుకెళ్లాడు. ఫంక్షన్ తర్వాత ఇంటికి వచ్చిన వారికి ఇచ్చాడు. ఓ కల్లు సీసాలో ఎలుక చనిపోయి ఉండడంతో అక్కడి వారు అవాక్కయ్యారు. ఇదేంటని కల్లు తయారీ చేసే యజమానిని ప్రశ్నించగా నేలచూపులు చూశాడు. ఇదే విషయంపై జిల్లా ఎక్సెజ్ శాఖ అధికారిణి గాయత్రిని వివరణ కోరగా… ఈ విషయం తన దృష్టికి రాలేదంటూ బదులిచ్చారు.
సెల్‌టవర్ ఎక్కి యువకుడి హల్‌చల్
నిర్మల్ జిల్లా బాసరలోని బస్టాండ్ సమీపంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో సుమారు నాలుగు గంటల పాటు హంగామా చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు యువకుడిని దించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గ్రామ యువకులతో నరేష్ ను క్రిందికి దింపి స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దాంతో పోలీసులు ఊపిరి పిచ్చుకున్నారు. నరేష్ ను కాపాడిన యువకులతో పాటు స్థానిక పోలీసులను గ్రామస్తులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై కారు, డీసీఎం ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో పది సంవత్సరాల బాలుడు, మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిద్ధరామయ్యకు ఊరట
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ముడా కేసు సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేసింది కర్నాటక హైకోర్టు. కాగా, లోకాయుక్త ముడా స్కామ్‌లో పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని, కాబట్టి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఇరు పక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎం.నాగప్రసన్న గత నెల 28న తీర్పు రిజర్వు చేశారు. విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని ధర్మాసనం పేర్కొంది.