అత్యాచారాన్ని ప్రతిఘటించిన ఓ గర్భిణీని కదులుతున్న రైలు నుంచి తోసేసిన ఘటన గురువారం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో, రేవతి (36) అనే గర్భిణీ తిరుప్పూర్ నుండి కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు బయల్దేరింది.
బాధితురాలు ఉదయం 6:40 గంటలకు రిజర్వేషన్ లేకుండా సాధారణ టికెట్ తీసుకుని రైలు ఎక్కి లేడీస్ కోచ్‌లో కూర్చుంది. ఆ సమయంలో కనీసం ఏడుగురు మహిళలు ఆ కోచ్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. రైలు 10:15 గంటలకు జోలర్‌పెట్టాయ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, మహిళలందరూ దిగడంతో కోచ్ ఖాళీగా అయింది.
రైలు కదులుతుండగా.. నిందితుడు హేమరాజ్ (27) కోచ్ ఎక్కాడు. అతను కొద్దిసేపు కూర్చున్నాడు. మహిళ ఒంటరిగా ఉందని గమనించి.. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు దీన్ని ప్రతిఘటించింది. దీంతో హేమరాజ్ ఆమెను కదిలే రైలు నుండి బయటకు విసిరాడని అధికారులు తెలిపారు.
మహిళకు కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలు తన పుట్టింటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు చెప్పారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. హత్య, దోపిడీకి సంబంధించిన కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు చెప్పారు.