కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి టార్గెట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు, కనెక్టింగ్ రోడ్లపై ట్వీట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పనులు నెమ్మదించాయని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎస్ఆర్‌డీపీ ద్వారా చొరవ తీసుకున్నామని చెప్పారు. దీని కింద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేనని తెలిపారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్‌డీపీ పనులు పూర్తిగా నెమ్మదించాయని విమర్శించారు.
గడిచిన 8 నెలలుగా ప్రభుత్వం తరుఫున సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు. ఎస్ఆర్‌డీపీ ఫేజ్-3 పనులను తిరిగి ప్రారంభించాలని కోరారు. ఈ ఫేజ్-3 పనుల్లో మూసీ వెంబడి ఎక్స్‌ప్రెస్‌వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్ నిర్మాణం, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఇతర అనేక గ్రేడ్‌సెపరేటర్లు ఉన్నాయని కేటీఆర్ అన్నారు.