35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

తెలుగుదేశం పార్టీలో మసకబారుతున్న సీనియర్ల ప్రాధాన్యత

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు యువతరం వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా అంతర్గత వాతావరణం మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు పెద్దపీట వేస్తూ, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెడుతున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. పదవులు దక్కక, కనీస ప్రాధాన్యత లభించక సీనియర్లు లోలోపల తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని చంద్రబాబు తేల్చి చెప్పడం సీనియర్ల అంకితభావాన్ని దెబ్బతీస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకీ దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను చంద్రబాబు ఎందుకు విస్మరిస్తున్నారు? సీనియర్ల అసంతృప్తి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పునాదులను కదిలిస్తుందా?

ఏ రాజకీయ పార్టీకైనా యువత ఉత్సాహం ఎంత అవసరమో, సీనియర్ నాయకుల అపారమైన అనుభవం కూడా అంతే అవసరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో యువతరానికి ఇస్తున్న ప్రాధాన్యతను.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలకు కూడా కచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అలా కాకుండా ఏకపక్షంగా యువతకే పెద్దపీట వేసుకుంటూ పోతే, భవిష్యత్తులో తీవ్రమైన రాజకీయ, సంస్థాగత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు తమకు తగిన పదవులు లేక, నిర్ణయాల్లో సరైన ప్రాధాన్యత లభించక తమలో తాము తీవ్ర అసహనాన్ని అణుచుకుంటున్నారు. బహిరంగంగా మాట్లాడలేకపోయినా, అంతర్గత సమావేశాల్లో వారి ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. పార్టీ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడి పోరాడిన తమను పక్కనపెట్టి, నిన్నకాక మొన్న వచ్చిన జూనియర్లకు అందలం ఎక్కిస్తుండటం సీనియర్లను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోంది. పార్టీ కోసం జీవితాలను ధారపోసినా తమకు గుర్తింపు కరువైందని వారు వాపోతున్నారు.

సీనియర్ల అసంతృప్తి ఒకవైపు రగులుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తన వైఖరిని అత్యంత స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. పార్టీలో కేవలం సీనియారిటీ ఉందన్న ఒకే ఒక్క కారణంతో పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని, నాయకుల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్ ఆధారంగానే నామినేటెడ్ పదవులు, ఇతర ప్రాధాన్యతలు లభిస్తాయని ఆయన నిర్మొహమాటంగా చెప్పేశారు. ఈ కఠినమైన ప్రకటనతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడింది. దీంతో కేవలం సీనియారిటీ, లాయల్టీ లాంటి విలువలకు ఇక పార్టీలో కాలం చెల్లిందని, కేవలం అధిష్టానం అడుగులకు మడుగులొత్తేవారికి, హైకమాండ్ దృష్టిలో పడేలా హడావుడి చేసే వారికే పదవులు వస్తాయన్న ఒక తప్పుడు అభిప్రాయం పార్టీ కేడర్‌లో బలంగా నాటుకుపోతోంది. ఎంతసేపూ పనితీరు, సర్వేల పేరుతో తమను అవమానిస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారన్నా, తెలుగుదేశం పార్టీ మళ్లీ ఈ స్థాయిలో అధికారంలోకి వచ్చిందన్నా.. అది కేవలం ఆయన ఒక్కరి వల్లే సాధ్యపడలేదని, క్షేత్రస్థాయిలో సీనియర్ల వ్యూహాలు, వారి పట్టుదల కూడా కీలక పాత్ర పోషించాయన్న వాస్తవాన్ని అధిష్టానం విస్మరించడం ఏమాత్రం సరికాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

కష్టకాలంలో జెండా మోసిన నేతలకు కనీసం నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా, కనీస గౌరవం కూడా ఇవ్వకపోతే సీనియర్ నేతల్లో పార్టీ పట్ల ఉన్న అంకిత భావం దెబ్బతింటుందన్న భావన రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎవరినీ లెక్క చేసే మూడ్‌లో లేరని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అండదండలు తమకు సంపూర్ణంగా ఉన్నాయన్న పూర్తి నమ్మకంతోనే ఆయన సీనియర్లను పక్కనపెట్టి యువతకు, ముఖ్యంగా నారా లోకేష్ టీంకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పొత్తుల బలంతో రాష్ట్రంలో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా ఆయన నిర్ణయాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న పలువురు సీనియర్ నేతలు మాత్రం, ఏదో ఒక రోజు తమ కష్టాన్ని గుర్తించి పదవులు ఇస్తారన్న చిన్నపాటి ఆశతో ఇంకా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే వారి ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతుండటంతో పాటు ఆవేదన రెట్టింపు అవుతోంది.

సీనియర్ నేతలకు ఏ రకమైన ప్రాధాన్యత లభించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వీరు పార్టీకి కొత్తగా ఎలాంటి ప్రయోజనం చేయలేకపోయినా పర్వాలేదు కానీ, లోలోపల అసంతృప్తితో రగిలిపోతూ పార్టీకి నష్టం చేయడం మాత్రం వారికి పెద్ద కష్టమేమీ కాదన్న విషయం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తాము అత్యంత సమపాళ్లలో తీసుకువెళుతున్నామని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పార్టీలో పదవుల పంపకం విషయంలోనూ అదే విధానాన్ని అవలంబించాలని పలువురు కోరుతున్నారు. జూనియర్లను, సీనియర్లను సమంగా చూడాలని, అప్పుడే పార్టీలో సమతుల్యత ఉంటుందని వారు వాదిస్తున్నారు. పార్టీకి దశాబ్దాల పాటు సీనియర్లు అందించిన అమూల్యమైన సేవలను ఇప్పుడు విస్మరిస్తే, రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ పట్ల పూర్తి అంకిత భావంతో నిస్వార్థంగా పనిచేసే వారు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరన్న తీవ్రమైన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని, ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించేవారని సీనియర్లు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన వైఖరిలో, ఆలోచనా విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఒక సీనియర్ నేత బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేయడం.. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న క్లిష్టమైన పరిస్థితికి అద్దం పడుతోంది. ఎన్టీఆర్ ఆశయాలతో ఏర్పడిన పార్టీలో ఇప్పుడు కేవలం కార్పొరేట్ తరహా పనితీరుకే ప్రాధాన్యత ఇవ్వడం పాత తరం నేతలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అధిష్టానం ఇదే ఒంటెద్దు పోకడను కొనసాగిస్తే, క్షేత్రస్థాయిలో కేడర్‌ను నడిపించే నాయకత్వం కరువై పార్టీ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సీనియర్ల అసంతృప్తిని గ్రహించి, వారి అనుభవాన్ని వాడుకుని జాగ్రత్త పడకుంటే… రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

కేటీఆర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవా?

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉండి, ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్