కాకినాడ ఎంపీకి టైం ఎప్పుడు దొరుకుతుంది?

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఇప్పుడు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. తనకున్న రాష్ట్ర స్థాయి బాధ్యతల వల్ల పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉండలేకపోవడంతో.. ఆ బాధ్యతలను స్థానిక కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు అప్పగించారు. కానీ ఆ ఎంపీ కనీస బాధ్యత తీసుకోకుండా, నియోజకవర్గంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య జరుగుతున్న వివాదాలను గాలికొదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సొంత పార్టీ అధినేత నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయన తీరుతో రగులుతున్న జనసేన కేడర్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?

పిఠాపురం… ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆకర్షణీయమైన నియోజకవర్గం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు పార్టీ పరమైన ఎన్నో బాధ్యతలు ఉండటంతో, పిఠాపురం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం ఆచరణ సాధ్యం కాని విషయం. ఈ వాస్తవాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్, తన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గ బాధ్యతలను కొందరు ముఖ్య నాయకులకు అప్పగించారు. వారిలో ప్రధానమైన వ్యక్తి కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. మిగతా నాయకులకు కేవలం రాజకీయ హోదా మాత్రమే ఉంటే, ఉదయ్ శ్రీనివాస్‌కు ఎంపీగా అధికారిక ప్రోటోకాల్ ఉంటుంది. నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగినా, అధికారుల నుంచి స్పందన కరువైనా వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించే పూర్తి అధికారం ఆయనకు ఉంది. సొంత పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో, ఆయన మరింత చొరవ తీసుకుని పనిచేస్తారని కేడర్ అంతా భావించింది.

నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు గమనిస్తే, అధికార కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య ఏమాత్రం సఖ్యత కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ ఇంచార్జ్ వర్మ వర్గానికి, స్థానిక జనసేన కేడర్‌కు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఎవరికి వారు ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేస్తుండటంతో నియోజకవర్గంలో తరచుగా వివాదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఒకే వేదికను పంచుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ వివాదాలు ముదిరినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని స్థానిక నేతలకు స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. కానీ, ఇక్కడే స్థానికంగా ఎంపీ హోదాలో ఉన్న ఉదయ్ శ్రీనివాస్ మాత్రం ఈ గొడవల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేయాల్సిన ఆయన, తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కనీసం వర్మ వర్గం జనసేన నాయకులను డిఫెన్స్‌లో పడేస్తున్నప్పుడైనా ఎంపీ స్పందించి తమకు అండగా నిలబడాలని గ్లాస్ పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. కానీ ఎంపీ నుంచి అలాంటి మద్దతు రాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి జనసేన అధిష్టానం ప్రత్యేకంగా ఒక ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. అత్యంత కీలకమైన ఈ కమిటీలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఒక ముఖ్య సభ్యుడిగా ఉన్నారు. అధికారికంగా ఇంత బాధ్యత ఉన్నప్పటికీ ఆయన వైపు నుంచి పార్టీ శ్రేణులకు ఎలాంటి సానుకూల స్పందన రావడం లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉదయ్ శ్రీనివాస్ వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉండేది. నియోజకవర్గంలో అంతా తానై తిరిగారు, ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోయారు. కానీ, ఒకసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన పనితీరు పూర్తిగా మారిపోయింది. ఆయన ఉన్నా లేకున్నా నియోజకవర్గానికి పెద్దగా ఒరిగేదేమీ లేదన్న భావన స్థానిక ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఐదు చోట్ల టీడీపీ, రెండు చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరు చోట్ల ఎవరి నియోజకవర్గంలో వారు పూర్తి పెత్తనం చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో లేనప్పుడు ఎంపీగా ఆయన ఖచ్చితంగా బాధ్యత తీసుకుని లీడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్థానిక నాయకులు ఎవరైనా ఏదైనా అత్యవసర పని ఉండి కలుద్దామని ఫోన్ చేస్తే, ఎంపీ నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం.. తాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానని. ఈ మాట పదే పదే విని జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ సొంత పార్టీ కార్యకర్తలను, కింది స్థాయి నాయకులను కలవడానికి కూడా ఎంపీకి సమయం దొరకనంత బిజీ ఏముంటుందని వారు సూటిగా విమర్శిస్తున్నారు. ఆయనకు వ్యాపారాలే అంత ముఖ్యం అనుకుంటే, పూర్తిగా ఆ పనులే చేసుకోవచ్చు కదా, ఇలా రాజకీయాల్లోకి వచ్చి క్యాడర్ ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. కనీసం పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో అయినా నియోజకవర్గంలో పర్యటించాలి కదా అన్న కనీస బాధ్యత కూడా ఆయనలో లోపించిందని వారు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నాకు అంత సమయం లేదని ఆయన నిర్మొహమాటంగా చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఎవరికీ లేని బిజీ కేవలం మా ఎంపీ గారికే ఉందంటూ సొంత పార్టీ నేతలే బహిరంగంగా సెటైర్లు వేస్తున్నారు.

గతంలో ఎంతో మంది పార్లమెంట్ సభ్యులను చూశాం కానీ, సొంత నియోజకవర్గంలో తిరగడానికి కూడా సమయం లేనంత బిజీ పర్సన్ ను ఇప్పుడే చూస్తున్నామని సీనియర్ నాయకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్ లా మారిపోయిందని, ఎంపీ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎన్నికల సమయంలో క్యాడర్ కూడా ఆయనకు సమయం ఇవ్వరని జనసేన కింది స్థాయి నాయకులు హెచ్చరిస్తున్నారు. స్థానికంగా టీడీపీ, జనసేన మధ్య తరచూ ఏవో గిల్లికజ్జాలు బయటపడుతూనే ఉన్నాయి. పరిస్థితి చేయి దాటకముందే అడ్వాన్స్ అయ్యి సమస్యను పరిష్కరించాల్సింది పోయి, అది తన పని కాదన్నట్లుగా ఎంపీ దూరంగా ఉంటున్నారు. కనీసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని అయినా కాపాడుకోండి సార్ అని వేడుకుంటున్నా ఆయన చెవికి ఎక్కడం లేదట. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇదే నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో సంస్థాగతంగా జనసేన పార్టీకి, అలాగే కూటమి సమన్వయానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
————–

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్