తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికార కూటమికి ఒక అతిపెద్ద గుణపాఠంగా మారాయి. కేవలం అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తే చాలు.. పాలకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారన్న భ్రమలను ద్రావిడ ఓటర్లు పటాపంచలు చేశారు. అటు తమిళనాడులో స్టాలిన్, ఇటు ఏపీలో చంద్రబాబుది దాదాపు ఒకే వయసు, ఒకే తరహా రాజకీయ ప్రయాణం. అయితే స్టాలిన్ సర్కార్ చేసిన తప్పులనే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సర్కార్ కూడా చేస్తోందని, వారసుల ఆధిపత్యం, కార్యకర్తల నిర్లక్ష్యం పునరావృతం అవుతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఇంతకీ తమిళనాడు ఫలితాలను చూసైనా ఏపీ అధికార కూటమి నేతలు మేల్కొంటారా? క్షేత్రస్థాయిలో కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చకపోతే రాబోయే ఎన్నికల్లో ఏపీలోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ ఒక బలమైన సందేశాన్ని పంపాయి. అధికారంలో ఉన్న నాయకులు కేవలం పాలకుల్లా కాకుండా, ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. గత ఐదేళ్ల డీఎంకే పాలనను విశ్లేషిస్తే, స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా వెనకబడలేదు. రాష్ట్ర జీడీపీలో దేశంలోనే అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి సజావుగానే పాలన సాగించింది. అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించింది. కానీ క్షేత్రస్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నా ముఖ్యమంత్రి స్టాలిన్ అడ్డుకట్ట వేయలేకపోయారు. దీనికి తోడు పార్టీలో, ప్రభుత్వంలో కుమారుడు ఉదయనిధి ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని తమిళ ప్రజలు ఏమాత్రం సహించలేకపోయారు. అన్నింటికీ మించి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన క్యాడర్‌ను డీఎంకే నాయకత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఫలితంగా సొంత పార్టీ కార్యకర్తలే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు అచ్చం ఇదే తమిళనాడు ఎన్నికల సీన్, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి కూడా అచ్చుగుద్దినట్లు సరిపోతోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ వయసు, రాజకీయ అనుభవం దాదాపు ఒకేలా ఉంటాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు సైతం రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమ పథకాలను సమపాళ్లలో తీసుకువెళుతూ బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం నాయకత్వం అంచనాలకు భిన్నంగా తయారవుతోంది. డీఎంకే పాలనలో జరిగినట్లుగానే, ఇక్కడ కూడా పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివిధ రకాలుగా అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, భూదందాలు తదితర అంశాల్లో స్థానిక నేతల హవా నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా పార్టీ నాయకత్వం మాత్రం ఈ వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోకుండా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. అవినీతిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో ప్రజలు ఏ రకంగా స్పందిస్తారన్నది ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ రాజకీయంగా ఎలాగైతే అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంలో, పార్టీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారో.. ఏపీలోనూ నారా లోకేష్ వ్యవహార శైలిపై అలాంటి చర్చే నడుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న లోకేష్.. ప్రస్తుతం అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంపై తన పట్టును మరింత బిగిస్తున్నారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో, అధికారుల బదిలీల్లో, పార్టీ నియామకాల్లో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్ నాయకుడు ఆయనే కాబట్టి ఆ స్థాయిలో పట్టు సాధించడం రాజకీయంగా సరైనదే అయినప్పటికీ, ఆ ఆధిపత్యం ఏమాత్రం శృతిమించినా రాజకీయంగా నష్టం తప్పదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కేవలం సంక్షేమాన్ని మాత్రమే చూడరని, నాయకత్వ వ్యవహార శైలిని, వారసుల పెత్తనాన్ని కూడా నిశితంగా గమనిస్తారని స్టాలిన్ ఎపిసోడ్ నిరూపించింది. కాబట్టి ఏపీలో లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రదర్శిస్తున్న ఆధిపత్యంపై రాబోయే ఎన్నికల నాటికి ఓటర్లు ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
ఏ రాజకీయ పార్టీకైనా ప్రాణప్రదమైనది క్షేత్రస్థాయిలో ఉండే సాధారణ కార్యకర్తలే. తమిళనాడులో డీఎంకే పరాజయానికి ప్రధాన కారణాల్లో క్యాడర్ నిర్లక్ష్యం ఒకటి. ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాఠీ దెబ్బలు తిని, అనేక కష్టనష్టాలకు ఓర్చి పార్టీ జెండాను భుజాన మోసిన నాయకులను, సామాన్య కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వం పూర్తిగా విస్మరించిందన్న విమర్శలు ఆ పార్టీ సోషల్ మీడియా వేదికల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన తమను వదిలేసి, ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, పైరవీకారులకే నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనులు కట్టబెడుతున్నారన్న ఆవేదన టీడీపీ శ్రేణుల్లో రగులుతోంది. కనీసం తమ స్థానిక సమస్యలను చెప్పుకుందామన్నా ఎమ్మెల్యేలు, మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వారు అంతర్గత వేదికల్లో బహిరంగంగానే వాపోతున్నారు. పార్టీ విజయం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వారిని విస్మరిస్తే అది రాబోయే రోజుల్లో పార్టీ పునాదులకే ముప్పుగా పరిణమిస్తుందన్న వాస్తవాన్ని నాయకత్వం గ్రహించాల్సి ఉంది.
తమిళనాడులో డీఎంకే పార్టీ ఐదేళ్ల పాలనను చూసిన తర్వాత.. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు పోలిక పెడుతూ అనేక మంది టీడీపీ అభిమానులే ఆన్లైన్ వేదికగా పోస్టులు పెడుతుండటం గమనార్హం. డీఎంకేను ఓడించింది ప్రత్యర్థులు కాదు, ఆ పార్టీ సొంత కార్యకర్తలే అన్న వాస్తవాన్ని వారు పదే పదే గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకత్వం కళ్లు తెరవాలని వారు కోరుతున్నారు. కార్యకర్తలను విస్మరించకుండా వారి కష్టాన్ని గుర్తించి, సరైన సమయంలో ఆదుకుంటేనే వచ్చే ఎన్నికల్లో ఆ క్యాడర్ తిరిగి ఉత్సాహంగా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు మరింత అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్నికల సమయంలో హడావుడి చేసి బాధపడటం కంటే.. ఇంకా మూడేళ్ల సమయం ఉన్నందున, ఇప్పటి నుంచే లోపాలను సరిదిద్దుకుని క్యాడర్‌కు భరోసా కల్పించాలని, అప్పుడే కూటమి ప్రభుత్వానికి ఢోకా ఉండదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.


